Kavitha | ప్రభుత్వం రహస్యంగా వ్యవహరిస్తోందని విమర్శ
Kavitha | ప్రభుత్వం రహస్యంగా వ్యవహరిస్తోందని విమర్శ
రైతులను మోసం చేస్తోన్న ప్రభుత్వం
Kavitha |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో రైతుల విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన అంశంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతుల పేరుతో ప్రత్యేక డిస్కాంను ఏర్పాటు చేసి వారిని మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలోని 29 లక్షల మంది రైతుల మోటార్ల భవిష్యత్తు ప్రస్తుతం గందరగోళంలో పడే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌కు డిస్టిబ్యూషన్ లైసెన్స్ మంజూరు కోసం దాఖలు చేసిన దరఖాస్తుపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి అన్ని రాజకీయ పక్షాలతో అభిప్రాయ సేకరణను చేపట్టింది. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ… గత ఆరు నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, ఇది నిజంగా రైతులకు ప్రయోజనం చేకూర్చేదే అయితే ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి లేదా వ్యవసాయ శాఖ మంత్రి రైతులతో ఎందుకు చర్చలు జరపలేదని కవిత ప్రశ్నించారు. రైతుల అభిప్రాయాలను తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం సరైన విధానం కాదన్నారు.
రైతుల వెనుక రహస్యంగా జీవోలు జారీ చేయడం, దరఖాస్తుల ప్రక్రియ చేపట్టడం ప్రభుత్వ ఉద్దేశాలపై అనుమానాలు కలిగిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరిస్తే ఇంత కీలకమైన అంశాన్ని అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదని, బిల్లు రూపంలో ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని కవిత డిమాండ్ చేశారు.
