Kalki2AliaBhatt | షూటింగ్‌పై క్రేజీ అప్‌డేట్! సోషల్ మీడియాలో వైరల్‌..

Kalki2AliaBhatt | షూటింగ్‌పై క్రేజీ అప్‌డేట్! సోషల్ మీడియాలో వైరల్‌..

Kalki2AliaBhatt | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమా విడుదలవడానికి ముందూ, ఆ తర్వాత కూడా ఎన్నో ఆసక్తికర విషయాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పుడు ‘కల్కి 2’ కూడా అదే బాటలో నడుస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా (సీక్వెల్) నుంచి దీపికా పదుకొణె తప్పుకుందనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఇప్పుడు దీపికా పోషించిన ‘సుమతి’ పాత్రలో ఎవరు నటిస్తారనేదే ప్రధాన చర్చ. కొద్దిరోజులుగా సాయిపల్లవి ఆ పాత్రను పోషిస్తుందనే వార్త విపరీతంగా వైరల్ అయ్యింది. కానీ, ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ఆ పాత్రకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేస్తామని వెల్లడించారు.

దీంతో దీపికా పాత్రను ఎవరు పోషిస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో మరో క్రేజీ వార్త తెగ ప్రచారంలోకి వచ్చింది. ‘కల్కి 2’లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇంతకీ ఆ పాత్ర ఏంటనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. నాగ్ అశ్విన్, అలియా భట్ కోసం కల్కిలో ఒక కొత్త పాత్రను సృష్టించారా? లేక దీపికా పాత్రలోనే అలియా నటిస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరోవైపు, కల్కి పార్ట్-2 కి సంబంధించిన దాదాపు 30% షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని, ఇందులో సుప్రీం యాస్కిగా కమల్ హాసన్ పాత్ర పూర్తి నిడివితో భయంకరమైన విలనిజంతో సాగనుందని తెలుస్తోంది. మరి ఈ సినిమాలో ఊహించని మలుపులు, అలియా భట్ ఎంట్రీపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే!