కడియం వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలు – దాసరి రాజ్‌కుమార్

కడియం వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలు – దాసరి రాజ్‌కుమార్

ధర్మసాగర్, ఆంధ్రప్రభ : మండలంలోని నారాయణగిరి గ్రామంలో నిర్వహించిన అభివృద్ధి సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవాలకు విరుద్ధమని బీఆర్ఎస్ నాయకుడు దాసరి రాజ్‌కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. “గత నాయకులు తట్టెడు మట్టి కూడా తీయలేదు” అని కడియం చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని, ప్రజలను మాయ మాటలతో మభ్యపెట్టే ప్రయత్నమని విమర్శించారు. మంగళవారం నారాయణగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కడియం శ్రీహరికి జిమ్మిక్కుల రాజకీయాలు కొత్త కాదని, ప్రజల భావోద్వేగాలతో ఆటలాడటం ఆయనకు అలవాటైపోయిందని దాసరి రాజ్‌కుమార్ ధ్వజమెత్తారు. మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య హయాంలోనే రైతుల కోసం అనేక సాగునీటి అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేశారు.

కొత్తకుంట్ల నుంచి సలేంద్ర కుంట వరకు, సింగరి కుంటలు, జబ్బ కుంటలు, నారాయణకుంట, గ్రామ చెరువులకు రెండు పంటలకు సరిపడా సాగునీరు అందేలా అప్పట్లో భారీ స్థాయిలో పనులు చేపట్టారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి పునాది వేసిన నాయకుల కృషిని ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం తక్కువ చేసి మాట్లాడటం దౌర్భాగ్యకరమన్నారు. నారాయణగిరి నుంచి చటాల్ తండా వరకు రోడ్డు నిధులు తీసుకురావడం, గాంధీ నుంచి ముప్పారం బైపాస్ రోడ్డు నిర్మాణం వంటి కీలక అభివృద్ధి పనులు కూడా గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయని ప్రజలకు బాగా తెలుసన్నారు. తెలిసిన నిజాలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం కడియం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అభిమానులు, నాయకులు కొలను రాజు, కొత్తకొండ కుమార్, బాలకుమార్, రాములు, ప్రశాంత్, తిరుపతి, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply