Kadiri | సైకిల్ ఎక్కిన 13 మంది వైసీపీ కౌన్సిలర్లు

  • పసుపు కండువా కప్పి స్వాగతించిన ఎమ్మెల్యే కందికుంట
  • నేరుగా క్యాంపున‌కు తరలిన టీడీపీ మద్దతు దారులు
  • 19న మున్సిపల్ చైర్ పర్సన్ వైస్ చైర్మన్ల ఎన్నిక


శ్రీ సత్యసాయి బ్యూరో, మే 16 (ఆంధ్రప్రభ) : ఎట్టకేలకు కదిరి మున్సిపల్ కౌన్సిల్ లోని 13మంది వైసీపీ కౌన్సిలర్లు శనివారం ఆపార్టీని వీడి టీడీపీలో చేరిపోయారు. గత కొన్ని రోజులుగా అసమ్మతి రాగం వినిపిస్తూ వైసీపీ తిరుగుబాటు కౌన్సిలర్లుగా ఉన్న 13మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీ కండువాలు కప్పుకొని సైకిల్ ఎక్కారు. దీంతో కదిరి మున్సిపల్ కౌన్సిల్ లో టీడీపీకి 25మంది కౌన్సిలర్ల మద్దతు లభించినట్లు భావించవచ్చు. మొత్తం 36 మంది కౌన్సిలర్ల‌కు గానూ 11మంది వైసీపీలో మిగిలిపోయారు.

వాస్తవానికి మున్సిపల్ ఎన్నికల్లో 36వార్డుల‌కు గానూ 30మంది వైసీపీ కౌన్సిలర్లు, ఒకరు వైసీపీ రెబల్ అభ్యర్థి గెలుపొందిన విషయం తెలిసిందే. కేవలం 5మంది టీడీపీ తరఫున ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల సందర్భంగా ఏడు మంది కౌన్సిలర్లు రెబల్ అభ్యర్థితో పాటు టీడీపీ లో చేరిపోయారు. అనంతరం 13మంది కౌన్సిలర్లు వైసీపీ పై తిరుగుబాటు చేస్తూ వచ్చారు. ఇందులో భాగంగానే గత నెలలో మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మున్సిపల్ చైర్ పర్సన్ నజీమున్నీసా (వైసీపీ) ని పదవి నుంచి దింపిన విషయం తెలిసిందే. కాగా ఈనెల 19వ తేదీన అనగా సోమవారం మున్సిపల్ చైర్ పర్సన్ అదేవిధంగా ఇరువురు వైస్ చైర్మన్ ల ఎన్నికకు సంబంధించి ప్రత్యేక సమావేశం ఉన్న విషయం తెలిసిందే. దీంతో కదిరి మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ తన ఖాతాలో వేసుకోనున్నది. అయితే చైర్ పర్సన్ పదవి ఎవరికి అనేది ఇప్పటికీ సస్పెన్స్ గా ఉన్నది.

Leave a Reply