సినిమా షూటింగ్లో జూనియర్ ఆర్టిస్ట్ గుండెపోటుతో మృతి..
సినిమా షూటింగ్లో జూనియర్ ఆర్టిస్ట్ గుండెపోటుతో మృతి..
- బంధువుల కోసం వెతుకుతున్న మేడ్చల్ పోలీసులు..
మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ మండలం మునీరాబాద్‌లోని ఓన్వా కన్వెన్షన్ హాల్ లో జరుగుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొన్న ఒక జూనియర్ ఆర్టిస్ట్ గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. మృతుడి కుటుంబ సభ్యుల వివరాలు తెలియకపోవడంతో మేడ్చల్ పోలీసులు వారి కోసం ఆరా తీస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మే 30న రాత్రి 10:30 గంటల సమయంలో మునీరాబాద్ లోని ఓన్వా (ONVA) కన్వెన్షన్‌లో సినిమా షూటింగ్ జరుగుతుండగా, జూనియర్ ఆర్టిస్ట్ ఆర్.ఎమ్.వి. భాస్కర్ ఇతని వయస్సు52 కార్డ్ నెం. 2212 ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు.
తోటి సిబ్బంది వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడు హైదరాబాద్ లోని కృష్ణానగర్ నివాసిగా, తండ్రి పేరు పలంగా అప్పారావుగా గుర్తింపు కార్డుల ద్వారా తెలిసింది. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డుల ప్రకారం ఆయన చిరునామా కోల్‌కతా అని ఉంది. అయితే, ఆయన మొబైల్ ఫోన్లో కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎటువంటి కాంటాక్ట్ నంబర్లు లభించలేదు.
కేవలం తోటి జూనియర్ ఆర్టిస్టులు, ఏజెంట్ నంబర్లు మాత్రమే ఉన్నాయి. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మృతుడి కుటుంబ వివరాలు గానీ, బంధువుల సమాచారం గానీ ఇప్పటివరకు లభ్యం కాలేదు.జూనియర్ ఆర్టిస్ట్ ఆర్.ఎమ్.వి. భాస్కర్ (కార్డ్ నెం. 2212) కు సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులు లేదా వారి సొంత ఊరి వివరాలు తెలిసిన వారు ఎవరైనా ఉంటే… వెంటనే మేడ్చల్ పోలీస్ స్టేషన్ ను సంప్రదించాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు. చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసేందుకు, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
