జ‌ర్నీ ఇక ‘స్మార్ట్’ !

  • రాష్ట్రంలో రోజుకు 18 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణం
  • ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు
  • తునిలో ఒకేరోజు నువ్వు ఉట్టా 6% సీట్లలో మహిళల ప్రయాణం

శ్రీ సత్యసాయి బ్యూరో, (ఆంధ్రప్రభ) : త్వరలో ఉచిత ప్రయాణానికి సంబంధించి మహిళలకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం అమలైన తర్వాత ప్రస్తుతం రోజుకు 18 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుశ్రీ సత్య సాయి జిల్లా మడకశిర ఆర్టీసీ డిపో సందర్శించి అక్కడ ప్రస్తుతం నిర్వహిస్తున్న కార్యాలయ భవనాలు, డిపో ఆవరణాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈనెల 15వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీబస్సులలో ఉచిత ప్రయాణం చేయడానికి స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే అని అన్నారు.

ఈ పథకం అమలైన నాలుగు రోజుల్లోనే రోజుకు 18 లక్షల మంది చొప్పున బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేసినట్లు ఎండి తెలిపారు. రాబోయే రోజుల్లో 26 లక్షల మంది మహిళలు రోజుకు ఉచిత ప్రయాణం చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

బస్సులో ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లు కూడా వంద శాతం నిండిపోతున్నాయని ఎండి వివరించారు. తునిలో ఒకే రోజే 106 శాతం సీట్లలో ప్రయాణం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. దీని ద్వారా ఆక్యుపెన్సీ గతంలో 70 శాతం నుండి 72 శాతం ఉండేదని, ప్రస్తుతం అది కాస్త పెరిగిందన్నారు.

ఉచిత ప్రయాణం లో ఎలాంటి లోపాలు లేకుండా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పడం జరిగింది. స్త్రీ శక్తి పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి వీలుగా రాష్ట్రంలో కొత్తగా 1,050 బస్సులను నెల రోజుల్లో కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఆర్టీసీ ఎండి తెలిపారు.

అంతేగాక కొన్నిచోట్ల అద్దె బస్సులను సైతం తీసుకొని, స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు కేటాయించిన బస్సులలో మాత్రం విద్యార్థులను తప్ప ఇతరులను అనుమతించడం జరగదని, ఒక ప్రశ్నకు సమానంగా ఆయన తెలిపారు.

పక్క రాష్ట్రమైన కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం గురించి ఇప్పటికే అవగాహన చేసుకోవడం జరిగిందని తెలిపారు.దీంతో అక్కడ ఎదురైన సమస్యలు ఇక్కడ ఎదురు కాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బస్సులో ప్రయాణించే ప్రయాణికులు డ్రైవర్లు, కండక్టర్లకు సహకరిస్తూ ప్రయాణం చేయాలని తెలియజేశారు.

స్త్రీ శక్తి పథకం అమలు ద్వారా ఆర్టీసీ కి ఏర్పడే నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. దీంతో తమకు ఎలాంటి నష్టం రాదని ఆయన స్పష్టం చేశారు. అంతర్ రాష్ట్ర సర్వీసుల్లో స్త్రీ శక్తి పథకాన్ని ప్రస్తుతం పూర్తిగా కొనసాగించడం లేదని తెలిపారు.అయితే దీనిపై త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్టీసీ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, అంతర్రాష్ట్ర సర్వీసుల్లో కూడా అమలు చేయాలా?వద్దా? అన్న విషయంపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

Leave a Reply