జీవోలు జారీ.. అభివృద్ధి పనులు ఎక్కడ?
- క్షేత్రస్థాయిలో ముందుకు సాగని పనులపై బీజేపీ ప్రశ్నలు
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: మండల అభివృద్ధి పేరుతో వరుసగా జీవోలు జారీ అవుతున్నప్పటికీ, వాటికి సంబంధించిన పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతోందని బీజేపీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ అన్నారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నెలకొక జీవో విడుదలవుతున్నా క్షేత్రస్థాయిలో అభివృద్ధి కనిపించడం లేదని మండల ప్రజలు విమర్శిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం జారీ చేసిన ప్రధాన జీవోలు, మంజూరైన నిధుల వివరాలను ఆయన వెల్లడించారు. 2026 జనవరి 9న ప్రస్తుతం సెరికల్చర్ భవనంలో కొనసాగుతున్న తహసీల్దార్ కార్యాలయానికి నూతన భవనం నిర్మాణం కోసం రూ.3.25 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు.
అలాగే 2026 ఫిబ్రవరి 13న కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కూడా) నిధులతో మడిపల్లె రోడ్డు నుంచి దేవన్నపేట క్రాస్ వరకు 100 అడుగుల రహదారి నిర్మాణానికి రూ.13 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదలైందని తెలిపారు.
మార్చి 16న నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కోసం రూ.1.02 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. ఎల్కతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ పనులు ప్రారంభం కాలేదని విమర్శించారు.
మండలంలో తరచూ ఎదురవుతున్న విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం 13 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు వ్యయంతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, అయితే వాటి పురోగతి ప్రజలకు కనిపించడం లేదన్నారు.
ఈ జీవోలు విడుదలైన సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌కు పాలాభిషేకాలు చేసి, బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అలాగే 50 పడకల ఆసుపత్రి మంజూరుకు సంబంధించి సీపీఐ నాయకులు కూడా కృతజ్ఞతా విలేకరుల సమావేశాలు నిర్వహించారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం జీవోలను ప్రకటనలకే పరిమితం చేస్తోందని ఆరోపించిన శ్రీకాంత్ యాదవ్, హుస్నాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జారీ చేయించిన జీవోలకు సంబంధించిన అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభమయ్యేలా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి, అభివృద్ధి పనులు క్షేత్రస్థాయిలో కనిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
