YCP Politics | సిగరెట్ కంటే వైసీపీ హానికరం
YCP Politics | సిగరెట్ కంటే వైసీపీ హానికరం
‘గొడ్డలి పార్టీ నెవర్ అగైన్’
YCP Politics | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : సిగరెట్ తాగడం ఆరోగ్యానికి ఎంత హానికరమో.. సమాజానికి వైసీపీ అంతకంటే ప్రమాదకరం అని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ ప్రజాస్వామ్య విలువలను నమ్మే నాయకుడు కాదని, అధికారం కోసం ఎలాంటి అడ్డదార్లకైనా సిద్ధపడతారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చట్టబద్ధమైన పరిధిలోనే అధికారాన్ని వినియోగిస్తారని, కానీ జగన్ మాత్రం ప్రతి విషయంలో హద్దులు దాటుతుంటారని మంత్రి విమర్శించారు.
రాష్ట్రంలో మళ్లీ వైసీపీ పాలన రావద్దంటే ‘గొడ్డలి పార్టీ నెవర్ అగైన్.. కూటమి అగైన్ అండ్ అగైన్’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పయ్యావుల పిలుపునిచ్చారు. ప్రజలు ఇచ్చిన 93 శాతం స్ట్రైక్ రేటుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుందని గుర్తు చేశారు. పోలింగ్ బూత్ స్థాయిలో పోరాడిన కార్యకర్తల కృషి, త్యాగం, ధైర్యమే కూటమి విజయానికి ప్రధాన కారణమని మంత్రి పేర్కొన్నారు. కార్యకర్తలను విస్మరించిన ఏ రాజకీయ పార్టీ కూడా దీర్ఘకాలం నిలవలేదని అన్నారు.
పార్టీలో అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలు పెరిగితే పతనం తప్పదని పయ్యావుల హెచ్చరించారు. చిన్నచిన్న విభేదాలను పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. సమస్యలు ఉంటే పార్టీలోనే పరిష్కరించుకోవాలని, పార్టీకి దూరం కావొద్దని హితవు పలికారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను గెలుచుకోవడానికి ఇప్పటి నుంచే శ్రేణులు సిద్ధం కావాలని సూచించారు. ఓటరు జాబితాపై పూర్తి పట్టు సాధించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. రాయలసీమ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన ప్రణాళిక ఉందని మంత్రి తెలిపారు. ఉద్యాన పంటలకు ప్రాధాన్యతనిస్తూ రాయలసీమను దేశంలోనే ప్రముఖ ‘హార్టికల్చర్ హబ్’గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
