యువతను తల్లిదండ్రులు మార్గనిర్దేశం చేయకపోతే సమాజానికి చేటు

యువతను తల్లిదండ్రులు మార్గనిర్దేశం చేయకపోతే సమాజానికి చేటు

– బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ:
యువతను తల్లిదండ్రులు సరైన మార్గంలో నడిపించకపోతే వారు సమాజానికి చేటుగా మారే ప్రమాదం ఉందని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని 15వ వార్డు టేకులబస్తీలోని కేపీఆర్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జరిగిన వార్డు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సభకు వార్డు కౌన్సిలర్ చింతల వసంత అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, తల్లిదండ్రులు పిల్లలపై సరైన దృష్టి పెట్టకపోవడం వల్లే కొందరు యువకులు గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బెల్లంపల్లి పట్టణంలో యువతలో గంజాయి వినియోగం పెరుగుతోందని పేర్కొన్నారు.వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రజల సహకారంతో గంజాయి నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

రిటైర్డ్ సీబీసీఐడీ అడిషనల్ ఎస్పీ పులియాల రవికుమార్ మాట్లాడుతూ, యువతను క్రీడల వైపు ఆకర్షించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. భవిష్యత్తులో బెల్లంపల్లిలో జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. వార్డు కౌన్సిలర్ చింతల వసంత మాట్లాడుతూ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, మున్సిపల్ చైర్‌పర్సన్ దావస్వాతి సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ఆడెపు పద్మ, మున్సిపల్ వార్డు అధికారులు అశోక్, రాజేందర్, కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్‌చార్జి కన్నూరి వెంకటేశ్వర్లు, టీపీసీసీ మీడియా సెల్ జిల్లా కోఆర్డినేటర్ దెవసాని ఆనంద్, ఆర్పీ శ్రీలత, సీనియర్ నాయకులు కన్నూరి రాజలింగు, కె. రాజరత్నం, చింతల బాలరాజు, యువజన నాయకులు బొల్లి వంశీ, చింతల లోకేశ్వర్, పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply