మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచి గ్రాట్యుటీ అమలు చేయాలి
పిల్లలకు ఇచ్చే మెనూ చార్జీలను పెంచాలి:
జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ధర్నా
చిత్తూరు, ఆంధ్రప్రభ : మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచి గ్రాట్యుటీ అమలు చేయాలని, పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న మెనూ చార్జీలను పెంచాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం చిత్తూరు కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా నాయకులు సుమతి, రాజేశ్వరి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, గౌరవ అధ్యక్షుడు నాగరాజు, జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్, మధ్యాహ్న భోజన పథకం జిల్లా కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ, గత 25 సంవత్సరాలుగా పాఠశాల విద్యార్థులకు భోజనం వండిపెడుతూ వారి ఆకలి తీరుస్తున్నామని తెలిపారు. బిల్లులు సకాలంలో వచ్చినా, రాకపోయినా నిరంతరం సేవలు అందిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఎన్నికల సమయంలో మహిళా కార్మికులకు అండగా ఉంటామని రాజకీయ పార్టీలు హామీలు ఇస్తున్నప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం లేదన్నారు. ప్రస్తుతం నెలకు కేవలం రూ.3 వేల వేతనంతోనే పనిచేస్తున్నామని, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో జీవనం భారంగా మారిందని చెప్పారు.
పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలంటే ప్రస్తుతం ఉన్న చార్జీలు సరిపోవడం లేదన్నారు. ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులకు ఒక్కో భోజనానికి కనీసం రూ.15, హైస్కూల్ విద్యార్థులకు రూ.20 చొప్పున మెనూ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్యాస్ ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేయడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. పాఠశాలలకు అవసరమైన గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాలని కోరారు. ఇతర రంగాల్లో పనిచేసే కార్మికులకు గ్రాట్యుటీ అమలు చేస్తున్న ప్రభుత్వం, మధ్యాహ్న భోజన కార్మికులకు మాత్రం వర్తింపజేయకపోవడం అన్యాయమని విమర్శించారు. వెంటనే వేతనాలు పెంచడంతో పాటు గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే రాష్ట్రస్థాయిలో “చలో విజయవాడ” కార్యక్రమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, గౌరవ అధ్యక్షుడు నాగరాజు, జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్, మధ్యాహ్న భోజన పథకం జిల్లా కార్యదర్శి రమాదేవి, ఏఐటీయూసీ జిల్లా నాయకులు విజయకుమార్, సుబ్రహ్మణ్యం, మధ్యాహ్న భోజన పథకం నాయకులు సుమతి, శైలజ, సెల్వి, మణి, మేఘాల, రాజేశ్వరి, రాజ్యలక్ష్మి, వినోద్, ఏసయ్య తదితరులు పాల్గొన్నారు.
