వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
– మున్సిపల్ చైర్‌పర్సన్ బానోత్ సునీత వెంకన్న
కేసముద్రం, ఆంధ్రప్రభ:
వార్డుల్లో ఉన్న సమస్యలను తోటి మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి పరిష్కరించేందుకు కృషి చేస్తామని కేసముద్రం మున్సిపల్ చైర్‌పర్సన్ బానోత్ సునీత వెంకన్న అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం అమీనాపురం వార్డు కార్యాలయంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్డు సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేసముద్రం మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా అమీనాపురం వార్డును సందర్శించిన ఆమెను 5వ వార్డు కౌన్సిలర్ లింగాల రాజమణి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా పంట మార్పిడి చేయాలని సూచించారు. ఒకే రకమైన పంటలను వరుసగా సాగు చేయడం వల్ల భూమి సారం తగ్గిపోతుందని తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి వార్డు సమస్యను వినేందుకు, పరిష్కరించేందుకు మున్సిపాలిటీ సిద్ధంగా ఉందని, ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి. శ్రీనివాస్ రావు, కౌన్సిలర్లు బానోత్ విజయ, లింగాల రాజమణి, బానోత్ అరుణ, విద్యాశాఖ, వ్యవసాయ శాఖ, వైద్య శాఖ, పోలీస్ శాఖ, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, ఆర్పీలు, మహిళలు, రైతులు పాల్గొన్నారు.
