Indrakeeladri | భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ఆషాఢ సారె..

అన్నదాన విభాగం సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు


Indrakeeladri | (ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి ) : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారికి ఆషాఢ మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయ అన్నదాన విభాగం అధికారులు, సిబ్బంది మంగళవారం భక్తిశ్రద్ధలతో ఆషాఢ సారె సమర్పించారు. మంగళవాయిద్యాల నడుమ సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి చీర, సారె, గాజులు, పసుపు, కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

అన్నదాన విభాగం అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ తిరుమలేశ్వరరావు, సూపరింటెండెంట్‌ హేమ పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. అన్నదాన విభాగం క్లర్కులు గంటా రమేష్, ప్రణీత్‌తో పాటు వంట మాస్టర్లు, కార్మికులు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్‌ రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్‌ మాట్లాడుతూ.. భక్తులకు నిరంతరం అన్నప్రసాద సేవలు అందించే అన్నదాన విభాగం సిబ్బంది అంతా ఏకతాటిపైకి వచ్చి అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించడం అభినందనీయమన్నారు. అమ్మవారి కృపాకటాక్షాలు అన్నదాన విభాగం సిబ్బందిపైనా, వారి కుటుంబాలపైనా ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందికి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.