తెలంగాణ సర్కారు స్కూళ్లలో తనిఖీల పర్వం..
ఆగస్టు 17 నుంచి తనిఖీలు!
రంగంలోకి 307 బృందాలు
24 వేల సర్కారు బడులపై ఫోకస్..
బడుల్లో చదువులు ఎలా ఉన్నాయి?..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, బోధన తీరు, మౌలిక వసతులపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆగస్టు 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో తనిఖీలు చేపట్టనుంది. దాదాపు 24 వేల ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించేందుకు 307 అకడమిక్ ప్యానెల్ బృందాలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది.
ఏం పరిశీలిస్తారు?
ఈ తనిఖీల్లో తరగతి గదుల్లో బోధన విధానం, పాఠ్య ప్రణాళిక, సిలబస్ పూర్తయిన తీరు, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు వంటి అంశాలను పరిశీలించనున్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానం సామర్థ్యాలను కూడా అంచనా వేయనున్నారు. ఉపాధ్యాయులకు అవసరమైన విద్యాపరమైన సహకారం అందించడం కూడా ఈ తనిఖీల ఉద్దేశంగా అధికారులు పేర్కొంటున్నారు. పాఠశాలల్లోని గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, తాగునీటి సౌకర్యం, పారిశుధ్యం, మధ్యాహ్న భోజన పథకం అమలు, భోజనం నాణ్యత, విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలు తదితర అంశాలపైనా బృందాలు దృష్టి సారించనున్నాయి.
307 బృందాలు.. మూడు విభాగాలుగా
24 వేల పాఠశాలల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన 307 బృందాల్లో 171 ప్రాథమిక పాఠశాలలకు, 38 ప్రాథమికోన్నత పాఠశాలలకు, 98 ఉన్నత పాఠశాలలకు కేటాయించినట్లు సమాచారం. తనిఖీలకు ముందు బృందాలకు మూడు విడతల్లో ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు.
తొలి విడత బృందాలు ఆగస్టు 17 నుంచి, రెండో విడత ఆగస్టు 21 నుంచి, మూడో విడత ఆగస్టు 24 నుంచి పాఠశాలలను సందర్శించనున్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల బృందాలు రోజుకు రెండు పాఠశాలలను, ఉన్నత పాఠశాలల బృందాలు రోజుకు ఒక పాఠశాలను పరిశీలించేలా ప్రణాళిక రూపొందించారు.
లోపాలపై నివేదికలు.. తదుపరి చర్యలు
క్షేత్రస్థాయి తనిఖీల అనంతరం ప్రతి పాఠశాలలో గుర్తించిన లోపాలు, విద్యార్థుల అభ్యసన స్థాయి, వసతుల పరిస్థితిపై నివేదికలు రూపొందించనున్నారు. ఈ నివేదికల ఆధారంగా పాఠశాలల్లో ఉన్న లోపాలను గుర్తించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా.. ఈ తనిఖీలతో సర్కారు బడుల్లో చదువు, బోధన, వసతుల అసలు పరిస్థితి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
