జూద స్థావరాలపై బాపట్ల పోలీసుల ఉక్కుపాదం
- ఎస్పీ ఆదేశాలతో విస్తృత దాడులు..
- అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు
బాపట్ల, ఆంధ్రప్రభ: జిల్లాలో అక్రమ జూద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చర్యలను ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా జూద స్థావరాలపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు.
అక్రమంగా జూద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులు చర్యలు చేపట్టారు. జిల్లాలో ఎక్కడైనా జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.
అక్రమ జూద కార్యకలాపాల కారణంగా కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నష్టపోయే అవకాశం ఉన్నందున వాటిని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని పట్ల జిల్లా పోలీసులు హెచ్చరించారు.
