ఆగస్టు 15న ఎర్రకోటపై ‘వందేమాతరం’

స్వాతంత్ర్య వేడుకల్లో తొలిసారి జాతీయ గీతానికి ముందు ఆలాపన

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈసారి ఎర్రకోటపై ‘వందేమాతరం’ గేయం ప్రతిధ్వనించనుంది. ఆగస్టు 15న తొలిసారిగా జాతీయ గీతం ‘జనగణమన’కు ముందు వందేమాతరం ఆలపించనున్నట్లు డిఫెన్స్ సెక్రటరీ ఆర్‌కే సింగ్ తెలిపారు. వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపైకి చేరుకున్న అనంతరం తొలుత వందేమాతరం ఆలపిస్తారని, ఆ తర్వాత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం జాతీయ గీతం జనగణమన ఆలపిస్తారని తెలిపారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వందేమాతరం గేయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.