మోరంపూడి సర్వీస్ రోడ్లకు మోక్షం.. పనులకు శ్రీకారం

  • రూ.3.40 కోట్లతో నిర్మాణం..
  • వారం రోజుల్లో పనులు పూర్తి చేస్తాం: ఆదిరెడ్డి శ్రీనివాస్

రాజమహేంద్రవరం, ఆంధ్రప్రభ: ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మోరంపూడి ఫ్లైఓవర్ అప్రోచ్, సర్వీస్ రోడ్ల నిర్మాణానికి ఎట్టకేలకు కదలిక వచ్చింది. రూ.3.40 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు మంగళవారం శంకుస్థాపన చేసినట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు.

గతంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చొరవ, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహకారంతో కొత్త టెండర్ ప్రక్రియను పూర్తి చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు.

మోరంపూడి ప్రాంతంలో సర్వీస్ రోడ్లు సరిగా లేకపోవడంతో స్థానికులు, వాహనదారులు చాలాకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే చెప్పారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా పనులను వేగంగా పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. వారం రోజుల్లో సర్వీస్ రోడ్డు పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిచిపోయిన అభివృద్ధి పనులను ఒక్కొక్కటిగా తిరిగి ప్రారంభిస్తున్నామని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల విషయంలో రాజకీయ విమర్శలకు తావులేకుండా ప్రజలకు ఉపయోగపడే పనులపై దృష్టి సారిస్తున్నామని ఆయన అన్నారు. గతంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.

మోరంపూడి ఫ్లైఓవర్ అప్రోచ్, సర్వీస్ రోడ్ల పనులు పూర్తయితే ఈ ప్రాంతంలో రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు వాహనదారుల ఇబ్బందులు తగ్గనున్నాయి. నగర అభివృద్ధిలో భాగంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.