పూజల పేరుతో మోసం

నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్‌

హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : భూమిలో, ఇళ్ల కింద భారీగా నిధులు ఉన్నాయని నమ్మించి అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టును శంషాబాద్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, రాజేంద్రనగర్‌ పోలీసులు రట్టు చేశారు. నిధులు బయటకు తీస్తామంటూ పూజలు నిర్వహించి, గుంతల్లో బొగ్గు, నకిలీ బంగారు పూత పూసిన నాణేలు పాతిపెట్టి బాధితులను నమ్మిస్తున్న ముఠాలోని నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మహ్మద్‌ మునావర్‌ అలియాస్‌ మున్నా (36), సయ్యద్‌ అలీ అష్రఫ్‌ (40), మహ్మద్‌ హాజీ (25), మహ్మద్‌ సల్మాన్‌ (29) ఈ ముఠాలో ఉన్నారు. వీరిలో మునావర్‌పై గతంలోనూ బేగంబజార్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇలాంటి కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

బొగ్గును బంగారంగా నమ్మించి..

ఇళ్ల కింద, భూముల్లో పాతకాలం నాటి నిధులు ఉన్నాయని బాధితులను నమ్మించేవారు. అనంతరం వారికి ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుందని చెప్పి గుంతలు తవ్వేవారు. ఆ గుంతల్లో బొగ్గు, మట్టి, నకిలీ బంగారు పూత నాణేలను ముందుగానే పాతిపెట్టేవారు. పూజలు పూర్తయిన తర్వాత బొగ్గు బంగారంగా మారుతుందని చెప్పి బాధితుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారని పోలీసులు వెల్లడించారు. ఇలా సుమారు 11 మందిని మోసం చేసి రూ.కోటికి పైగా వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. నిధుల ఆశతో నిందితుల మాటలు నమ్మిన బాధితులు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించినట్లు గుర్తించారు.

నకిలీ నాణేలు.. పూజా సామగ్రి స్వాధీనం

నిందితుల నుంచి రెండు కార్లు, ఒక ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్‌ఫోన్లు, 25 నకిలీ బంగారు పూత నాణేలు, ఆరు కిలోల బొగ్గు, నాలుగు కిలోల మట్టి, పూజా సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఠా మరెవరినైనా ఇదే తరహాలో మోసం చేసిందా? ఇందులో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణాల్లోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.

నిధుల పేరుతో మోసపోవద్దు

భూమిలో నిధులు ఉన్నాయని, పూజలు చేస్తే బంగారం బయటకు వస్తుందని ఎవరైనా చెబితే నమ్మి డబ్బులు ఇవ్వవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. ఇలాంటి అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.