నాణ్యతా ప్రమాణాలు లేకుండా చేస్తున్న యూజీడీ పనులను నిలిపివేయాలి

ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని పనులపై అధికారులు పర్యవేక్షణ పెంచాలి

భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టాలి: మాజీ ఎమ్మెల్యే

కోదాడ, ఆంధ్రప్రభ: కోదాడ పట్టణంలో కొనసాగుతున్న యూజీడీ పనులు ప్రజలకు ప్రయోజనం కల్పించాల్సింది పోయి తీవ్ర ఇబ్బందులు, అసౌకర్యాలు, ప్రమాదాలకు కారణమవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ ఆరోపించారు. నాణ్యతా ప్రమాణాలు, శాస్త్రీయ పద్ధతులు, ముందస్తు భద్రతా చర్యలు పాటించకుండా పనులు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం పట్ల అధికారులు, కాంట్రాక్ట్‌ సంస్థలు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.

కోదాడ పట్టణంలోని 22వ వార్డులో జరుగుతున్న యూజీడీ పనులను మల్లయ్య యాదవ్‌ పరిశీలించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూజీడీ పనుల కోసం రోడ్లను తవ్వి నెలల తరబడి పునరుద్ధరించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తవ్విన గుంతలను అలాగే వదిలేయడం, రాత్రి వేళల్లో హెచ్చరిక బోర్డులు, భద్రతా చర్యలు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. పనులపై అధికారులు, ఇంజనీరింగ్‌ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేయాలని డిమాండ్‌ చేశారు.

మంచినీటి పైపులు, డ్రైనేజీ కనెక్షన్లు, విద్యుత్‌ లైన్లు, రోడ్లు దెబ్బతింటున్నప్పటికీ వెంటనే మరమ్మతులు చేపట్టడం లేదని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్న సందర్భాలు ఉన్నాయని తెలిపారు. యూజీడీ పనులకు ఏర్పాటు చేస్తున్న పైపుల సామర్థ్యం, డిజైన్‌, భవిష్యత్‌ పట్టణ అవసరాలపై నిపుణులతో సమగ్ర పరిశీలన చేయాలని కోరారు. తగిన సామర్థ్యం లేని పైపులు ఏర్పాటు చేస్తే భవిష్యత్‌లో ప్రజలు మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

యూజీడీ పనులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ మురుగునీటి వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలని, కాలువల శుభ్రతపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. పారిశుధ్య లోపంతో దోమల సమస్య పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు. కాంట్రాక్ట్‌ సంస్థ పనితీరుపై గతంలోనే తమ పార్టీ ఆరోపణలు చేసిందని పేర్కొన్న ఆయన, పనుల కేటాయింపులో ఏవైనా నిబంధనల ఉల్లంఘనలు జరిగాయా అనే అంశంపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

ప్రజలకు ఉపయోగపడాల్సిన వందల కోట్ల రూపాయల పనులు నాణ్యత లేకుండా జరిగితే చివరకు నష్టపోయేది కోదాడ ప్రజలేనని మల్లయ్య యాదవ్‌ అన్నారు. ప్రజాధనం సక్రమంగా వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కోదాడ పట్టణ పారిశుధ్యం, సుందరీకరణ కోసం చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. ప్రస్తుతం పారిశుధ్య సమస్యలు, యూజీడీ పనుల ఇబ్బందులతో ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు.

ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి యూజీడీ పనుల నాణ్యతను పరిశీలించాలని, ప్రమాదకరంగా ఉన్న గుంతలను భద్రతా ప్రమాణాలతో నిర్వహించాలని, దెబ్బతిన్న మంచినీరు, విద్యుత్‌, డ్రైనేజీ కనెక్షన్లను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే నాణ్యతను విస్మరించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో న్యాయపోరాటంతో పాటు ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.