పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి అండ..

కొయ్యలగూడెం, ఆంధ్రప్రభ : అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తోందని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. కొయ్యలగూడెం మండలం రామానుజపురం, సరిపల్లి, కన్నాపురం గ్రామాల్లో మంగళవారం లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితుల కారణంగా వైద్య చికిత్స చేయించుకోలేని బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో ఊరటనిస్తోందన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందడంతో లబ్ధిదారులు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పిన్నమనేని మధు, జనసేన నాయకులు వామిశెట్టి మధు, కొప్పుల రాజేష్‌, సుంకర రాజేష్‌ (ఎంపీటీసీ), ఉదయ్‌ కిరణ్‌, తోట మోహనమురళి, ఆవల్ల పేర్రాజు, కొత్తపెళ్లి శీను, గంట రాంబాబు, పారెపల్లి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.