నటుడిగా, రచయితగా కృష్ణేశ్వరరావు ప్రత్యేక గుర్తింపు

హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలుగు రంగస్థల, సినీ రంగాల్లో తనదైన ముద్ర వేసిన నటుడు, రచయిత యల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం (ఆగస్టు 11న) తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కృష్ణేశ్వరరావుకు చిన్ననాటి నుంచే నాటకాలపై ఆసక్తి ఉండేది. పాఠశాల రోజుల నుంచే రంగస్థలంపై నటించడం ప్రారంభించిన ఆయన.. ‘వాపస్‌’ నాటకంతో తన కళా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత నటుడిగానే కాకుండా రచయితగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన 1,500కుపైగా నాటకాల్లో నటించడంతో పాటు పలు నాటకాలకు రచన చేశారు.

సినిమా రంగంలోనూ కృష్ణేశ్వరరావు పలు చిత్రాల్లో నటించారు. ‘అంకురం’, ‘భద్రాచలం’, ‘శ్రీరాములయ్య’, ‘జయం మనదేరా’, ‘గోపి గోపిక గోదావరి’, ‘సరదాగా కాసేపు’, ‘చందమామ కథలు’, ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘నాంది’, ‘విరూపాక్ష’ తదితర చిత్రాల్లో ఆయన కనిపించారు.

‘చందమామ కథలు’తో ప్రత్యేక గుర్తింపు

ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ‘చందమామ కథలు’ చిత్రంలో భిక్షగాడి పాత్రలో కృష్ణేశ్వరరావు మెప్పించారు. సొంతింటి కల కోసం డబ్బు కూడబెట్టే వ్యక్తిగా ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రానికి జాతీయ పురస్కారం లభించగా, కృష్ణేశ్వరరావుకు నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం లభించింది.

రచయితగానూ ఆయన పలు చిత్రాలకు పనిచేశారు. ‘శ్రీరాములయ్య’, ‘జయం మనదేరా’, ‘భద్రాచలం’ వంటి చిత్రాలకు కథా రచనతో పాటు ‘పరశురామ్‌’ వంటి చిత్రాలకు సంభాషణలు అందించారు. రంగస్థలంపై సుదీర్ఘ అనుభవం, సినిమాల్లో విభిన్న పాత్రలు, రచయితగా చేసిన కృషితో కృష్ణేశ్వరరావు తెలుగు కళారంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు.