అవయవదానం.. మహాదానం..

  • బ్రెయిన్‌ డెత్‌ అనంతరం అవయవదానంతో పలువురికి పునర్జీవితం
  • అపోహలు, భయాలను వీడి.. శాస్త్రీయ అవగాహన పెంచుకోవాలి
  • ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా కర్నూలు జీజీహెచ్‌లో అవగాహన ర్యాలీ

కర్నూలు, ఆంధ్రప్రభ : ‘అవయవదానం–మహాదానం.. మీ నిర్ణయం–మరొకరికి జీవితం’ అనే సందేశంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని నిర్వహించారు. అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా. కె. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు.

కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డా. కె. చిట్టి నరసమ్మ, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా. కె. వెంకటేశ్వర్లు ర్యాలీని ప్రారంభించారు. ‘అవయవదానం–మహాదానం’.. ‘మీ నిర్ణయం–మరొకరికి జీవితం’.. ‘అవయవాలను దానం చేద్దాం–ప్రాణాలను కాపాడుదాం’ అంటూ నినాదాలు చేస్తూ వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది ప్రజలకు అవయవదాన ప్రాధాన్యతను వివరించారు.

అవయవదానంపై అపోహలు వీడాలి

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ డా. చిట్టి నరసమ్మ, సూపరింటెండెంట్‌ డా. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అవయవదానంపై ప్రజల్లో ఉన్న అపోహలు, భయాలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. అవయవదానం విషయంలో శాస్త్రీయ అవగాహన పెంపొందితే ఎంతోమంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు.

అవయవదానంపై కుటుంబ సభ్యులు సానుకూల నిర్ణయం తీసుకోవడం ద్వారా అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న అనేక మంది రోగులకు కొత్త జీవితం అందించవచ్చని పేర్కొన్నారు.

బ్రెయిన్‌ డెత్‌.. అవయవదానానికి అవకాశం

యూరాలజీ విభాగాధిపతి డా. ముత్యశ్రీ, నెఫ్రాలజీ విభాగాధిపతి డా. సోమ అనంత్‌ మాట్లాడుతూ బ్రెయిన్‌ డెత్‌ అనంతరం కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వస్తే పలువురు రోగులకు పునర్జీవితం అందించవచ్చని తెలిపారు. ఒక వ్యక్తి అవయవదానం ద్వారా ఒకరికి మాత్రమే కాకుండా పలువురు అవసరమైన రోగులకు జీవనావకాశం కల్పించవచ్చన్నారు. అవయవదానం పట్ల సమాజంలో మరింత చైతన్యం రావాల్సిన అవసరం ఉందని సూచించారు.

కార్యక్రమంలో యూరాలజీ విభాగాధిపతి డా. ముత్యశ్రీ, నెఫ్రాలజీ విభాగాధిపతి డా. సోమ అనంత్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డా. పక్కి రెడ్డి, డా. శ్రీధర్‌ శర్మ, డా. రాజశేఖర్‌, డా. బాల రవితేజ, డా. మహేష్‌ నాయక్‌, నర్సింగ్‌ సిబ్బంది, ఇతర ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. అవయవదానం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని.. మరణానంతరం తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా వైద్యులు పిలుపునిచ్చారు.