గుంటూరులో మౌలిక వసతులపై క్షేత్రస్థాయి పరిశీలన

  • కబాడీగూడెం మేజర్ డ్రైన్‌కు మార్కింగ్ చేయాలని ఆదేశం..
  • ఆరు వార్డులకు ప్రయోజనం

గుంటూరు, ఆంధ్రప్రభ: గుంటూరు నగరంలో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించారు. గుంటూరు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కబాడీగూడెం మేజర్ డ్రైన్ నిర్మాణానికి అవసరమైన మార్కింగ్ ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత డ్రైన్ నిర్మాణంతో పరిసర ప్రాంతాల్లోని సుమారు ఆరు వార్డులకు ప్రయోజనం కలగనుంది. వర్షాకాలంలో మురుగునీరు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు.

అదేవిధంగా నగరంలో సురక్షిత తాగునీటి సరఫరా, నీటి క్లోరినేషన్ ప్రక్రియను కమిషనర్, ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందేలా నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మౌలిక వసతుల అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వాటికి వేగంగా పరిష్కారం చూపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.