ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రకు ఎంపికైన గిరిజన యువతికి ఐటీడీఏ ఆర్థిక సాయం
ఉట్నూర్, ఆంధ్రప్రభ: ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రకు ఎంపికైన గిరిజన యువతి మడవి కన్నిబాయికి ఐటీడీఏ ఆధ్వర్యంలో రూ.2.35 లక్షల ఆర్థిక సాయం అందించారు. శనివారం రాత్రి ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో ప్రాజెక్టు అధికారి మంద మకరంద్ చెక్కును అందజేసి ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా పర్వతారోహణపై ఆమెకు ఆసక్తి ఎలా కలిగింది, శిక్షణ, ఇప్పటివరకు సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్ల గురించి అడిగి తెలుసుకున్నారు.
మడవి కన్నిబాయి మాట్లాడుతూ చిన్ననాటి నుంచే సాహస క్రీడలపై ఆసక్తితో పర్వతారోహణలో శిక్షణ పొంది ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రకు ఎంపిక కావడం జీవితంలో గొప్ప మైలురాయిగా పేర్కొంటూ ప్రభుత్వం, ఐటీడీఏ అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన యువతలో అపార ప్రతిభ ఉందని, ప్రతిభావంతులైన యువతకు ఐటీడీఏ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రాజెక్టు అధికారి మంద మకరంద్ అన్నారు.
