ఆలూరు బ్రాంచ్‌ కాలువలో సాగునీటి సంక్షోభం..

ఆలూరు బ్రాంచ్‌ కాలువలో సాగునీటి సంక్షోభం..

  • నీటి కోసం రైతుల ‘పైపులైన్‌ పోరాటం’
  • 18 మంది నాన్‌ ఆయకట్టు రైతులపై కేసులు నమోదు
  • ఏబీసీ కాలువలో అక్రమ కనెక్షన్లతో దిగువ రైతులకు నీటి ఎద్దడి

చిప్పగిరి, ఆంధ్రప్రభ : ఆలూరు బ్రాంచ్‌ కాలువ (ఏబీసీ) పరిధిలో సాగునీటి సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. కాలువ చివరి భాగాల రైతులకు నీరు అందకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో కొందరు నాన్‌ ఆయకట్టు రైతులు అనుమతులు లేకుండా కాలువకు పైపులైన్లు వేసుకుని నీటిని మళ్లించేందుకు ప్రయత్నించగా, అధికారులు కఠిన చర్యలకు దిగారు. మొత్తం 18 మంది రైతులపై కేసులు నమోదు కావడం ప్రస్తుతం ఆలూరు మండలంలో హాట్‌టాపిక్‌గా మారింది.

రవిశంకర్‌రెడ్డి, నరసింహులు తెలిపిన వివరాల మేరకు, కురువ రాము, సత్యన్న, వెంకటేష్‌, బాబు సహా మరో 14 మంది రైతులు అనుమతులు లేకుండా పైపులైన్‌ నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు. నీటిపారుదల శాఖ డీఈ చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు చిప్పగిరి పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తుంగభద్ర నీరు రాక…

హంద్రీ కాలువపై ఆధారపడిన రైతాంగం ప్రస్తుతం తుంగభద్ర జలాశయం నుంచి ఏబీసీ కాలువకు తగిన స్థాయిలో సాగునీరు అందకపోవడంతో రైతాంగం పూర్తిగా హంద్రీ కాలువపై ఆధారపడాల్సి వస్తోంది. కానీ అందుబాటులో ఉన్న నీరు పరిమితంగా ఉండటంతో ఆయకట్టు చివరి ప్రాంతాలకు నీరు చేరకపోవడం రైతుల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. అధికారుల వివరాల ప్రకారం ఏబీసీ కాలువ పరిధిలో సుమారు 14,265 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ మొత్తం భూములకు సాగునీరు సరఫరా చేయాల్సిన పరిస్థితిలో, మధ్యలోనే కొందరు నాన్‌ ఆయకట్టు రైతులు అక్రమంగా పైపులైన్లు వేసుకుని నీటిని మళ్లించడంతో దిగువ ప్రాంత రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు.

“నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి”
“చట్టాన్ని అతిక్రమించక తప్పడం లేదు” అంటున్న రైతులు

మరోవైపు నాన్‌ ఆయకట్టు రైతుల వాదన మాత్రం భిన్నంగా ఉంది. వరుసగా కరవు పరిస్థితులు, బోర్లు ఎండిపోవడం, విద్యుత్‌ ఖర్చులు పెరగడం వంటి కారణాలతో సాగు చేయడం కష్టమైందని, కనీసం పంటను కాపాడుకునేందుకు కాలువ నీటిపై ఆధారపడాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. “పంటలు కళ్లముందే ఎండిపోతుంటే రైతు ఏం చేస్తాడు?” అనే ప్రశ్న ఇప్పుడు గ్రామాల్లో వినిపిస్తోంది. సాగునీరు అందక రైతులు చట్టాన్ని అతిక్రమించే స్థాయికి వెళ్లడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా మారింది. అధికార అనుమతులు లేకుండా పైపులైన్లు వేయడం నేరమే అయినప్పటికీ, దానికి దారితీసిన పరిస్థితులపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆయకట్టు రైతుల్లో ఆగ్రహం

ఇక అధికారిక ఆయకట్టు రైతులు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు కేటాయించిన నీటిని అక్రమంగా మళ్లించడంతో చివరి భూములకు చుక్క నీరు కూడా అందడం లేదని ఆరోపిస్తున్నారు. కొందరు రైతులు అధిక శక్తి మోటార్లతో నీటిని లిఫ్ట్‌ చేయడం వల్ల కాలువలో నీటి ప్రవాహం పూర్తిగా దెబ్బతింటోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏబీసీ రైతుల ఫిర్యాదుల మేరకు నీటిపారుదల శాఖ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. డీఈ చంద్రశేఖర్‌, ఏఈ శ్రీధర్ మాట్లాడుతూ, “నాన్‌ ఆయకట్టు సాగు, అక్రమ పైపులైన్ల వల్ల కాలువ చివరి రైతులకు నీరు అందడం లేదు.

ఇకపై ఇలాంటి చర్యలను ఉపేక్షించం” అని హెచ్చరించారు. సాగునీటి రాజకీయంగా మారుతున్న వివాదం ఆలూరు ప్రాంతంలో సాగునీటి కొరత ప్రతి ఏడాది వివాదాలకు దారితీస్తున్నా, ఈసారి పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఒకవైపు నీరు కోసం రైతుల ఆవేదన, మరోవైపు అధికారుల కఠిన వైఖరి కలిసి ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. నీటి పంపిణీలో సమగ్ర ప్రణాళిక లేకపోతే రానున్న రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాలువలో నీటి ప్రవాహం తగ్గిపోవడం, పైప్రాంతాల్లో అధిక వినియోగం, అనధికార కనెక్షన్లు… ఇవన్నీ కలిసి ఆలూరు బ్రాంచ్‌ కాలువను ఇప్పుడు జిల్లాలో అత్యంత చర్చనీయాంశంగా మార్చాయి. రైతు బతుకుబండిని కాపాడుకోవాలనే ఆవేదన ఒకవైపు ఉంటే, చట్టబద్ధమైన ఆయకట్టు హక్కులను పరిరక్షించాలనే మరోవైపు పోరాటం కొనసాగుతోంది.