ప్ర‌తి అర్జీకీ నాణ్య‌మైన ప‌రిష్కారం చూపండి..

ప్ర‌తి అర్జీకీ నాణ్య‌మైన ప‌రిష్కారం చూపండి..

గ‌డువులోపు స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషిచేయాలి..
జిల్లాస్థాయి పీజీఆర్ఎస్‌కు 88 అర్జీలు..
జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, ఆంధ్రప్రభ : ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌)కు వ‌చ్చే ప్ర‌తి అర్జీపైనా ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని.. అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్దిష్ట గ‌డువులోగా స‌మ‌స్య‌కు నాణ్య‌మైన ప‌రిష్కారం చూపాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. సోమ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారుల‌తో క‌లిసి ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన ప్ర‌జ‌ల నుంచి మొత్తం 88 అర్జీలు వ‌చ్చాయి. వీటిలో పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌కు 18, రెవెన్యూకు 14, పంచాయ‌తీరాజ్‌కు 12, పోలీసు శాఖకు 12 అర్జీలు వ‌చ్చాయి.

విభిన్న ప్ర‌తిభావంతుల సంక్షేమం, డీఆర్‌డీఏ, సాంకేతిక విద్య‌కు మూడు చొప్పున, వ్య‌వ‌సాయం, విద్య‌, ఆరోగ్యం, మైన్స్‌, నైపుణ్యాభివృద్ధికి రెండు చొప్పున అర్జీలు రాగా.. ప్ర‌జా ర‌వాణా, విద్యుత్‌, బ్యాంకింగ్‌, బీసీ సంక్షేమం, స‌హ‌కార‌, ఎక్సైజ్‌, దేవాదాయ‌, గృహ నిర్మాణం, ప‌రిశ్ర‌మ‌లు, ఇరిగేష‌న్‌, మార్కెటింగ్‌, సాంఘిక సంక్షేమం, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల‌కు ఒక్కో అర్జీ వ‌చ్చాయి. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా, ప్రాధాన్య‌త‌తో పీజీఆర్ఎస్ కార్య‌క్ర‌మాన్ని అమ‌లుచేస్తోంద‌ని.. ఈ కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జా స‌మ‌స్య‌లు స‌త్వ‌రం ప‌రిష్కారం కావాల‌ని స్ప‌ష్టం చేశారు.

క్షేత్ర‌స్థాయి అధికారుల‌తో నిరంత‌ర స‌మ‌న్వ‌యంతో అర్జీల ప‌రిష్కారానికి కృషిచేయాల‌న్నారు. సమస్యల పరిష్కారంలో పారదర్శకత, బాధ్యతాయుత విధానం పాటించాలని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ స్ప‌ష్టం చేశారు. కార్య‌క్ర‌మంలో వివిధ శాఖ‌ల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply