బాబా రాందేవ్ పర్యటన..

  • అమరావతి స్తూపం నుంచి భవానీ ఐలాండ్ వరకు సందడి
  • విజయవాడ, అమరావతిలో ప్రముఖ ప్రాంతాల సందర్శన
  • కనకదుర్గమ్మ దర్శనం.. పూజలు…
  • బోట్ లో భవాని ఇలాండ్ సందర్శన

ఆంధ్రప్రభ, విజయవాడ : ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ శనివారం విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. బాబా రాందేవ్‌తో పాటు తన ప్రతినిధులు కూడా ఈ పర్యటనలో పాల్గొననున్నారు.

పర్యటన ఇలా…

శనివారం పర్యటనలో భాగంగా ముందుగా అమరావతి స్తూపాన్ని సందర్శించనున్న బాబా రాందేవ్ అక్కడ మీడియా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అనంతరం అమరలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసుకుని మీడియాతో ముచ్చటించనున్నారు. మధ్యాహ్నం వరకు మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో గడిపిన అనంతరం తిరిగి విజయవాడకు చేరుకోనున్నారు.

శనివారం సాయంత్రం ప్రకాశం బ్యారేజ్ వద్ద పరిశీలన జరిపి మీడియా సమావేశంలో పాల్గొనే బాబా రాందేవ్, అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. అమ్మ వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం భవానీ ఐలాండ్‌కు బోటు ప్రయాణం చేసి పర్యాటక ప్రాధాన్యంపై మీడియాతో చర్చించనున్నట్లు సమాచారం.

బాబా రాందేవ్‌కు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ‘జెడ్’ కేటగిరీ భద్రత దృష్ట్యా ఆయన పర్యటించే అన్ని ప్రాంతాల్లో స్వాగతం, భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టాలని ఆయుష్ శాఖ టూరిజం అధికారులను కోరింది. దీంతో విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం కానున్నాయి.