‘ఆంధ్రప్రభ’ కథనంతో కదిలిన అధికారులు…
‘ఆంధ్రప్రభ’ కథనంతో కదిలిన అధికారులు…
- ఇందిరమ్మ ఇల్లు మోసం ఆరోపణలపై విచారణ
- బాధితురాలి ఇంటికే వెళ్లి విచారణ
- పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తాం
- మున్సిపల్ కమిషనర్ మురళి
అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట మున్సిపాలిటీ 16వ వార్డులో ఇందిరమ్మ ఇల్లు పేరుతో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు డబ్బులు వసూలు చేసి అమాయకులను మోసం చేశాడనే ‘ఆంధ్రప్రభ ’లో ప్రచురితమైన కథనం ప్రభావం చూపింది. ఈ విషయంపై స్పందించిన మున్సిపల్ అధికారులు బాధితురాలు నామసాని శిల్ప ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. మున్సిపల్ కమిషనర్ మురళి, మేనేజర్ రమేష్ నాయక్, హౌసింగ్ డీఈ హరి నాయక్ కలిసి బాధితురాలిని విచారించారు.

ప్రజాపాలనలో భాగంగా శిల్ప ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుందని, సర్వే సమయంలో అద్దె ఇంట్లో ఉంటున్నట్లు, స్వంత స్థలం లేదని తెలిపిన కారణంగా ఆమె పేరును ఎల్-2 జాబితాలో నమోదు చేసినట్లు కమిషనర్ వివరించారు. ప్రస్తుతం ఆమెకు స్థలం ఉన్నప్పటికీ, కుటుంబ భాగ పరిష్కారాలు మాత్రమే జరిగాయని, సంబంధిత భూ పత్రాలు అందుబాటులో లేవని తెలిపారు. అవసరమైన డాక్యుమెంట్లు సమర్పిస్తే ఎల్-2 నుంచి ఎల్-1కు మార్పు చేసి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపనున్నట్లు మున్సిపల్ కమిషనర్ మురళి తెలిపారు.
