Asian Games 2026 | పతకాల వేటకు భారత షట్లర్లు రెడీ..
Asian Games 2026 | పతకాల వేటకు భారత షట్లర్లు రెడీ..
- సాత్విక్-చిరాగ్, సింధుపై ఆశలు..
- స్వర్ణ లక్ష్యంతో భారత్..
- యువ షట్లర్లకు అవకాశం
ఆంధ్రప్రభ: జపాన్‌లో జరిగే ఆసియా క్రీడలు-2026 (Asian Games) కోసం భారత బ్యాడ్మింటన్ జట్టును భారత బ్యాడ్మింటన్ సంఘం (బీఏఐ) ప్రకటించింది. భారత స్టార్ షట్లర్ పీ.వి. సింధు, అగ్రశ్రేణి ఆటగాడు లక్ష్య సేన్, డిఫెండింగ్ చాంపియన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జట్టుకు ప్రధాన బలంగా నిలిచారు. , 2026 మే 26 నాటికి ఉన్న బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్, అలాగే జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా సెలక్షన్ కమిటీ ఈ తుది జట్టును ఖరారు చేసింది.

అనుభవజ్ఞులకు చోటు.. యువతకు ప్రోత్సాహం.. !
పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్య సేన్‌తో పాటు హెచ్.ఎస్. ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ వంటి అనుభవజ్ఞులకు కూడా జట్టులో స్థానం లభించింది. గత ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టు చారిత్రాత్మక రజత పతకం సాధించడంలో వీరు కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో ఆయుష్ శెట్టి, తన్వీ శర్మ, ఉన్నతి హూడా వంటి యువ షట్లర్లకు కూడా అవకాశం కల్పిస్తూ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని బీఏఐ ఎంపికలు చేసింది.
వ్యక్తిగత విభాగాల్లో ఎంపికైనవారు –
- పురుషుల సింగిల్స్ : లక్ష్య సేన్, ఆయుష్ శెట్టి.
- మహిళల సింగిల్స్ : పీ.వి. సింధు, ఉన్నతి హూడా.
- పురుషుల డబుల్స్ : సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి / చిరాగ్ శెట్టి, హరిహరన్ అంసకరుణన్ / ఎం.ఆర్. అర్జున్.
- మహిళల డబుల్స్ : త్రీసా జాలీ / గాయత్రీ గోపీచంద్, కవిప్రియా సెల్వం / సిమ్రాన్ సింఘి.
- మిక్స్‌డ్ డబుల్స్ : ధృవ్ కపిలా / తనిషా క్రాస్టో
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ చరిత్రలో భారత్ ఇప్పటివరకు 13 పతకాలు సాధించింది. గత ఆసియా క్రీడల్లో సాత్విక్-చిరాగ్ జోడీ పురుషుల డబుల్స్‌లో స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించింది. ఇక 1982 న్యూఢిల్లీ ఆసియా క్రీడల్లో భారత్ అత్యధికంగా ఐదు కాంస్య పతకాలు సాధించింది. ఈసారి అనుభవజ్ఞులు, యువ ప్రతిభావంతుల సమతుల్యతతో బరిలోకి దిగుతున్న భారత జట్టు నుంచి మరోసారి పతకాల వర్షం కురుస్తుందనే ఆశలు క్రీడాభిమానుల్లో నెలకొన్నాయి.
