IND vs SA | తొలి వన్డేలో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ !!
- రాంచీ వన్డే రసవత్తరం…
- రో–కో ధాటికి భారీ స్కోర్
- కుల్దీప్ స్పిన్ మ్యాజిక్
- ఉత్కంఠ తొలి వన్డేలో భారత్ విజయం
రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఆఖరి ఓవర్లలో దక్షిణాఫ్రికా తరఫున కార్బిన్ బోష్ కీలకంగా రాణించినా… టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అభిమానులు అత్యంత ఆతృతగా ఎదురుచూసిన రోహిత్–కోహ్లీ జోడీ మరోసారి వన్డేల్లో కనువిందు చేసింది. రోహిత్ (57) అర్ధసెంచరీ, కోహ్లీ (135) శతకం అభిమానులను ఉర్రూతలూగించాయి..
అయితే, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ నమోదు చేసింది. రోహిత్–కోహ్లీ జోడీ రెండో వికెట్‌కు 136 పరుగులు జోడించి జట్టుకు బలమైన పునాది వేసింది.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధిక సిక్సులు (351) బాది కొత్త రికార్డు నెలకొల్పాడు. ఇదివరకు ఈ రికార్డు 15 సంవత్సరాల పాటు పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ (350) పేరిట ఉండేది. తాజాగా రోహిత్ అతన్ని అధిగమించి వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సులు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు.
రోహిత్ ఔటైన తర్వాత వచ్చిన రుతురాజ్ గౌక్వాడ్ (8), వాషింగ్టన్ సుందర్ (13) ఎక్కువసేపు నిలబడలేకపోయారు.
వారి తరువాత కెప్టెన్ కెఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చి కోహ్లీతో కలిసి ఐదో వికెట్‌కు 76 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యంతోనే కోహ్లీ తన 52వ వన్డే సెంచరీ (అంతర్జాతీయంగా 83వ శతకం) పూర్తి చేశాడు. చివర్లో జడేజా (32) జోడించిన విలువైన పరుగులు భారత స్కోరుకు తోడు అయ్యాయి. దీంతో టీమిండియా 8 వికెట్ల నష్టానికి మొత్తం 349 పరుగులు చేసింది.
అనంతరం 350 పరుగుల ఛేజింగ్‌లో దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే కష్టాలు ఎదురయ్యాయి. తొలి ఐదు ఓవర్లలోనే టాప్ ఆర్డర్ పెవిలియన్ చేరింది. ర్యాన్ రికల్టన్ (0), క్వింటన్ డికాక్ (0), ఐడెన్ మార్కరం (7) వరుసగా పెవిలియన్ బాట పట్టారు. అయితే, ఆ తర్వాత మాథ్యూ బ్రీట్జ్కే (72), టోనీ డి జోర్జీ (39), డెవాల్డ్ బ్రెవిస్(37), మార్కో జాన్సెన్ (70), ఆఖర్లో కార్బిన్ బాష్ (67) కీలక ఇన్నింగ్స్‌లతో జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశారు.
టీమిండియా బౌలర్లను ఇబ్బంది పెడుతూ మ్యాచ్‌ను ఉత్కంఠగా నడిపించారు. అయినప్పటికీ, భారత బౌలర్లు ధీటుగా బదులిస్తూ…కీలక సమయాల్లో వికెట్లు తీసి సౌతాఫ్రికాను ఒత్తిడికి గురిచేశారు. దీంతో సౌతాఫ్రికా లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. చివర్లో మ్యాచ్ ఉత్కంఠగా మారినప్పటికీ భారత్ గెలుపును సొంతం చేసుకుంది.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ అత్యధికంగా నాలుగు వికెట్లు (4/68) తీయగా, హర్షత్ రాణా మూడు వికెట్లు (3/65) దక్కించుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ (2/64), ప్రసిధ్ కృష్ణ (1/48) వికెట్లు పంచుకున్నారు.


