పెద్ది సుదర్శన్‌రెడ్డికి మాజీ ఎంపీ సురేందర్‌రెడ్డి నివాళి
నల్లబెల్లి, ఆంధ్రప్రభ: దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిపట్ల మాజీ వరంగల్ ఎంపీ సురేందర్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం నల్లబెల్లి గ్రామానికి చేరుకున్న ఆయన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు. ఒకప్పుడు పెద్ది సుదర్శన్‌రెడ్డిని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించి రాజకీయంగా ప్రోత్సహించిన సురేందర్‌రెడ్డి, ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రజల మనిషిగా గుర్తింపు పొందారని, ఆయన ప్రజాసేవలను ఎవరూ మరచిపోలేరని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పెద్ది సుదర్శన్‌రెడ్డి సేవలను స్మరించుకున్నారు.
