AP | యాడికిలో ఉద్రిక్తత…
వైసీపీ-టీడీపీ నేతల బైఠాయింపు
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అనంతపురం జిల్లా యాడికి మండలంలో డీఎస్సీ అక్రమాల ఆరోపణల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ నాయకులు దీక్షకు దిగగా, దీనిని టీడీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా దీక్షలు నిర్వహించడం సరైంది కాదంటూ టీడీపీ నేతలు కూడా అదే ప్రాంతంలో నిరసనకు దిగారు. దీంతో ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకేచోట బైఠాయించి నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల నేతలతో చర్చలు జరిపారు. పరిస్థితి అదుపుతప్పకుండా చర్యలు తీసుకుంటూ ఇరుపక్షాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం యాడికిలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
