Qr-Code-Ap-Handicrafts : హస్తకళలకూ టెక్ సేఫ్ Andhra Prabha Top News

Qr-Code-Ap-Handicrafts : హస్తకళలకూ టెక్ సేఫ్ Andhra Prabha Top News

  • రంగంలో ప్రత్యేక క్యూఆర్ కోడ్
  • స్కాన్ చేస్తే చాలు
  • ఇట్టే కళాఖండం చరిత్ర
  • కళాకారుడి కష్టాన్ని చెప్పేస్తుంది .
  • నకిలీ ఉత్పత్తులకు చెక్

(ఆంధ్ర‌ప్ర‌భ‌, అమ‌రావ‌తి )

Qr-Code-Ap-Handicrafts : ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా లేపాక్షి ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టింది. దీనిలో భాగంగా ప్రతి కళాఖండం, కళారూపం పూర్తి వివరాలు తెలిసేలా, దాన్ని రూపొందించిన కళాకారుడికి తగిన గుర్తింపు లభించేలా వాటి పూర్తి వివరాలను తెలుసుకునేలా ప్రత్యేక క్యూఆర్ కోడ్ వ్యవస్థ తీసుకురావాలని పవన్ కళ్యాణ్ ఇటీవల నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం సందర్భంగా సూచించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశంతో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ కేవలం నెల రోజుల వ్యవధిలో దేశంలో తొలిసారిగా హస్తకళలకు క్యూఆర్ కోడ్ వేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఒక్క స్కాన్‌తో పూర్తి వివరాలు . కళ- ఉత్పత్తి- వివరాలు ప్రతిపాదికన ఈ క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చారు. కొనుగోలుదారులు వస్తువుపై ఉన్న కోడ్‌ను మొబైల్‌తో స్కాన్ చేస్తే ఆ కళాఖండానికి సంబంధించిన పూర్తి వివరాలను సెకన్లలో తెలుసుకోవచ్చు. ఆ వస్తువు చరిత్ర, సాంస్కృతిక విశిష్టత, తయారు చేసిన కళాకారుడి పేరు, వారి నైపుణ్యం, తయారు చేయడానికి వారు పడిన కష్టం, ఉపయోగించిన ముడిసరుకు, తయారీకి పట్టిన సమయం, వస్తువు కొలతలు వంటి వివరాలతోపాటు, దానికి భౌగోళిక గుర్తింపు లేదా ఒక జిల్లా–ఒక ఉత్పత్తి గుర్తింపు ఉందా అనే సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది.

Qr-Code-Ap-Handicrafts : దశలవారీగా విస్తరణ

మొదటి దశలో రాష్ట్రంలోని విభిన్న సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచే 8 ఐకానిక్ హస్తకళా ఉత్పత్తులకు క్యూఆర్ కోడ్ ప్రొఫైల్స్‌ను అధికారులు కేటాయించారు. బొబ్బిలి వీణతోపాటు, సంపూర్ణ రామాయణం, మహాభారతం, శ్రీ కృష్ణలీలా, మత్స్యావతారం కలంకారి పెయింటింగ్స్, అలాగే సవర ఆదివాసి పెయింటింగ్స్ ఉన్నాయి. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని హస్తకళా ఉత్పత్తులు, కళాకారుల క్లస్టర్లకు ఈ విధానాన్ని విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా నకిలీ ఉత్పత్తులకు అడ్డుకట్ట పడటంతోపాటు, ఏపీ హస్తకళలకు ప్రపంచ మార్కెట్‌లో మరింత గుర్తింపు లభించి, కళాకారుల ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.