చెన్నూరులో అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

చెన్నూరు, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో అక్రమ ఇసుక రవాణాదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పొక్కురు గ్రామ సమీపంలోని గోదావరి నది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల నిఘా ఎక్కువగా ఉంటుందనే భయంతో రాత్రి వేళల్లో కాకుండా, అక్రమార్కులు మిట్టమధ్యాహ్నం సమయాన్ని ఎంచుకుని గోదావరి నది నుండి ఇసుకను తరలిస్తున్నారు.
ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న చెన్నూరు సీఐ బన్సీలాల్ తన సిబ్బందితో కలిసి పొక్కురు గ్రామ పరిసరాల్లో మాటు వేశారు. పోలీసులు దాడులు నిర్వహిస్తున్న క్రమంలో, ఒక ట్రాక్టర్ డ్రైవర్ పోలీసుల నుండి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వేగంగా వెళ్తూ పక్కనే ఉన్న పొలాల్లోకి ట్రాక్టర్‌ను తీసుకెళ్లి ఇసుకను అన్లోడ్ చేస్తుండగా పోలీసులు వెంబడించి మరీ పట్టుకున్నారు.
పట్టుబడిన రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు ఇద్దరు డ్రైవర్లు, యజమానులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, నిబంధనలు అతిక్రమించే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయడానికి కూడా వెనుకాడమని చెన్నూరు సీఐ బన్సీలాల్ హెచ్చరించారు.
