Ashwini Vaishnav | రైల్వే బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణకు భారీ కేటాయింపులు..
రైల్వే బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు జరిపినట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రైల్వే బడ్జెట్ కేటాయింపులపై ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ కు రూ.9,417 కోట్ల విలువైన ప్రాజెక్టులను కేటాయించినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అలాగే తెలంగాణకు 5,337 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించామని చెప్పారు.
తెలంగాణలోని కాజీపేటలో రైల్వే ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేస్తామన్న ఆయన… ఇప్పటి వరకు తెలంగాణకు 41,677 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కాజీపేట ప్రొడక్షన్ యూనిట్ తో పాటు.. కొత్త రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో 1,326 కిలోమీటర్ల మేర కవచ్ ప్రాజెక్ట్ రానుందని.. ఇది 6 నుంచి 7 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే నమో భారత్ రైళ్లు (సమీప నగరాల మధ్య), అమృత్ భారత్ రైళ్లు (తక్కువ ఖర్చుతో మెరుగైన సౌకర్యాలతో కూడిన రైళ్లు) అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రూ.84,559 కోట్ల విలువైన పనులు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. 74 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేశమని.. 1560 కిలోమీటర్ల మేర కొత్త రైలు మార్గాన్ని ఏర్పాటు చేశామన్నారు. 16 జిల్లాలను కలుపుతూ 8 వందేభారత్ రైళ్లు ఏపీకి సేవలు అందిస్తున్నాయన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని వందేభారత్ రైళ్లు వస్తాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ పనులన్నీ పూర్తయితే ప్రయాణికులకు అనేక సౌకర్యాలు కల్పిస్తామన్నారు.