Illegal Power | మూడు త‌రాలపై అక్ర‌మ విద్యుత్ క‌నెక్ష‌న్ల మృత్యు కాటు

హైద‌రాబాద్ – హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ ప్రాంతంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం మృత్యుపాశాన్ని మోసుకొచ్చింది. ఈ ఘటనపై పోలీసులు, ఫైర్‌ సిబ్బంది ప్రాథమికంగా చేసిన దర్యాప్తులో ఓ కీలక విషయాన్ని బయటపెట్టింది. ఆ విషాదానికి మూలం అక్రమ కరెంట్ కనెక్షన్ ఉన్న ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రభావిత భవనానికి ఎదురుగా ఉన్న నగల దుకాణం రాత్రి మూతపడిన అనంతరం, అక్కడి కొన్ని కుటుంబాలు హైటెన్షన్ వైర్ నుంచి కరెంట్‌ను కోక్కేల ద్వారా అక్రమంగా వినియోగిస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమ లైన్‌ను ఉపయోగిస్తూ బాధిత కుటుంబం ఇంటి కరెంట్‌ మీటర్‌పై ఎక్కువ లోడ్ పడినట్లు తెలుస్తోంది. అదే లోడ్ కారణంగా మీటర్‌బాక్స్‌లో మంటలు చెలరేగినట్టు.. ఆ మంటలు మొదట మీటర్ బాక్స్‌లో వచ్చి, ఆ బాక్స్‌ పక్కన ఉన్న ఉడెన్‌ షోకేజ్‌ను అంటుకున్నాయి.

అక్కడ నుంచి మంటలు మరింతగా వ్యాపించి ఏసీ కంప్రెసర్‌ వరకు తాకాయి. అప్పటికే భవనం పై అంతస్తుల్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులు ఏమీ గ్రహించకుండానే మంటలు ఇంటి అంతటా విస్తరించాయి. ఈ ప్రమాదానికి కారణమైన అక్రమ కరెంట్ కనెక్షన్లపై పోలీసులు, ఫైర్‌ సిబ్బంది ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు. హైటెన్షన్ లైన్ల నుంచి వ్యక్తిగతంగా కరెంట్ తీసుకోవడాన్ని గమనించి, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు స‌మ‌చారం.

ఈ నేపథ్యంలో స్థానికంగా మరిన్ని ఇలాంటి అక్రమ కనెక్షన్లున్నాయా అనే దానిపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో చిన్నచిన్న నిబంధనల ఉల్లంఘన ఎంతటి ప్రాణ నష్టం కలిగించగలదో మరోసారి తేలిపోయింది.

మూడు త‌రాల‌ను మింగేసి అగ్నిప్ర‌మాదం

హైదరాబాద్‌లోని పాతబస్తీ గుల్జార్‌ హౌజ్‌ వద్ద ఘోర అగ్ని ప్రమాదం జరిగి ఆదివారం ఉదయం 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వారందరూ ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలవారు. గుల్జార్‌హౌజ్‌ వద్ద ముత్యాల వ్యాపారి ప్రహ్లాద్‌ మోదీ(73)కి జీ ప్లస్ 2 బిల్డింగ్ ఉంది. కింద పోర్షన్‌లో వారికి 3 ముత్యాల దుకాణాలు ఉన్నాయి. ప్రహ్లాద్‌ మోదీ తాత దాదాపు 150 ఏళ్ల క్రితం ముత్యాల వ్యాపారం చేసేందుకు హైదరాబాద్ వచ్చారు. గుల్జార్ హౌజ్ వద్ద ఓ బిల్డింగ్‌ కొని వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ వ్యాపారాన్ని ప్రహ్లాద్ మోదీ తండ్రి పూనంచంద్ కొనసాగించారు.

అతడి నుంచి ఈ వ్యాపారాన్ని ప్రహ్లాద్ మోదీ, అతడి సోదరుడు రాజేంద్ర కుమార్ మోదీ తీసుకున్నారు. బిల్డింగ్‌లోని కింది భాగంలో ముత్యాల వ్యాపారం చేస్తున్న ప్రహ్లాద్ మోదీ, అదే బిల్డింగ్‌లోని పై రెండు అంతస్తుల్లో కొడుకులు, మనుమలతో కలసి ఉంటున్నారు. ప్రహ్లాద్ మోదీకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు.
చిన్న కుమారుడు పంకజ్ మోదీ, భార్య ముగ్గురు పిల్లలతో తండ్రి వద్దే ఉంటున్నాడు. అగ్ని ప్రమాదంలో ప్రహ్లాద్‌ మోదీ దంపతులతో పాటు వారి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, మనుమలు, మనవరాళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలవారు మృతి చెందడంతో బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *