మేడ్చల్‌లో బీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు..

మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి సమక్షంలో ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో మేడ్చల్ మున్సిపాలిటీకి చెందిన సుమారు 50 మంది ఇతర పార్టీల కార్యకర్తలు, యువకులు బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, నరేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, భాస్కర్, ప్రవీణ్, మురళి, నవీన్, రామకృష్ణ సహా పలువురు యువకులు పార్టీలో చేరారు.

వీరందరికీ ఎమ్మెల్యే మల్లారెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ​కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అంటూ ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి కేవలం కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమని ప్రజలు బలంగా నమ్ముతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పాలనపై యువతలో వ్యతిరేకత ఉందని, మల్లారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం సాధించిన అభివృద్ధిని చూసి తాము పార్టీలో చేరినట్లు వెల్లడించారు.

ఈ ​కార్యక్రమంలో మేడ్చల్ మండల బీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షుడు దయానంద్ యాదవ్, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, జవహర్‌ నగర్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, కార్పొరేటర్ రాజశేఖర్ శ్రీనివాస్ రెడ్డి, బాబు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. పేద, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం మల్లారెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని, రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు.