Hormuz Strait Crisis | భారత్ చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం

Hormuz Strait Crisis | భారత్ చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం
Hormuz Strait Crisis | హార్మూజ్ జలసంధిపై ఇరాన్ కఠిన నియంత్రణ
పడిపోతున్న రూపాయి.. పెరుగుతున్న ఆర్థిక భారం
ప్రత్యామ్నాయ చమురు మార్గాల కోసం భారత్ ప్రయత్నాలు
ప్రపంచ చమురు సంక్షోభానికి దారితీస్తున్న యుద్ధం
Hormuz Strait Crisis | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: ఇరాన్-అమెరికాల మధ్య చర్చలు ఎంతకీ ఓ కొలిక్కి రావడం లేదు. ఇరువైపులా తమ పంతాలను, పట్టింపులను రోజు రోజుకు బిగిస్తున్నారు. హార్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు వీడడం లేదు. పైగా దీనిపై నియంత్రణలను మరింత కఠినతరం చేసింది.
ప్రపంచంలో అత్యంత కీలకమైన ఈ ఇంధన మార్గాన్ని తమ సైనిక నియంత్రణలోనే కొనసాగిస్తోంది. పైగా దీని నిర్వహణకు కొత్తగా పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఇక ముందు జలసంధి ద్వారా ప్రయాణించాలంటే ఈ అథారిటీ ముందస్తు అనుమతి కావాల్సిందే. ఇది కేవలం ఇరాన్ పరిధిలోనే కాదు.. పక్కనున్న ఒమన్, యుఎఇ దేశాల ప్రాదేశిక జలాల్లోని సుమారు 22 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతంపై ఈ అథారిటీయే పర్యవేక్షణ చేస్తుందని ప్రకటించింది.
హార్మూజ్ ద్వారా నౌకల ప్రయాణానికి ఇరాన్ టోల్ వసూలు చేస్తోంది. అది కూడా తాము స్నేహపూర్వకంగా భావించే రష్యా, చైనా, దక్షిణకొరియా, భారత్, పాకిస్థాన్‌లకు చెందిన నౌకలకు మాత్రమే అనుమతులు ఇస్తోంది. రోజూ సుమారు 140కి పైగా నౌకలు ఈ జలసంధి ద్వారా ప్రయాణించేవి. యుద్ధం మొదలయ్యాక రోజూ మూడు నుంచి నాలుగు నౌకలకు మాత్రమే ఈ ప్రయాణానికి అనుమతులు లభిస్తున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది.
మరీ ముఖ్యంగా వినియోగిస్తున్న చమురులో 90 శాతం పైగా దిగుమతులపై ఆధారపడ్డ భారత్‌లో పరిస్థితి మరింత కఠినంగా మారింది. ప్రత్యామ్నాయ మార్గాల్లో చమురు రవాణాతో వ్యయం పెరిగింది. ఈ అదనపు భారాన్ని ప్రభుత్వం వినియోగదార్లపై మోపుతోంది. సహజంగానే ఇది అన్నిరంగాలపైనా ప్రభావం చూపిస్తోంది. అమెరికా-ఇరాన్ యుద్ధం భారత్‌లో ఆర్థిక మాంద్యానికి కారణమైంది. దేశంలో చమురు, సహజ వాయువుల ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ గణనీయంగా పడిపోయింది. ప్రజల జీవన ప్రమాణాలు మందకొడిగా మారాయి.

అదనపు భారాన్ని నేరుగా ప్రభుత్వమే భరించాలంటే సుమారు లక్ష కోట్లు అవుతుందంటూ సంబంధిత యంత్రాంగం ప్రకటించింది. ఈ స్థాయిలో అదనపు వ్యయం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. అలాగని హార్మూజ్ సంక్షోభం ఎప్పట్లో తేలేదీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. అప్పుడప్పుడూ కాల్పుల విరమణ ప్రకటిస్తున్నా అవి తాత్కాలికంగానే ముగుస్తున్నాయి. యుద్ధ విరమణ విషయంలో ఇరాన్-అమెరికా రెండు దేశాలు కనీసం ఓ మెట్టు దిగడం లేదు. ఈ దశలో హార్మూజ్ సంక్షోభం ఎన్నాళ్లు కొనసాగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది.
ప్రపంచ వ్యాప్తంగా రవాణా అవుతున్న చమురులో 20 శాతం, సహజ వాయువుల్లో 22 శాతం ఈ జలసంధి ద్వారానే ప్రయాణిస్తున్నాయి. భారత ఇంటర్నెట్ కేబుళ్లలో మూడింట ఒక వంతు ఇక్కడి సముద్ర గర్భం ద్వారానే ప్రయాణిస్తున్నాయి. అలాగే భారత్ చమురు దిగుమతుల్లో 60 శాతం, సహజవాయువు దిగుమతుల్లో 80 శాతం ఈ మార్గంలోనే ఇక్కడకు చేరుతున్నాయి.
హార్మూజ్ తిరిగి ఎప్పుడు తెరుచుకుంటుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఒకవేళ చర్చలు సఫలమై హార్మూజ్‌ను ఇరాన్ తెరిచినప్పటికీ కనీసం ఆరు మాసాల పాటు ఈ మార్గంలో ప్రయాణం ప్రమాదమే. జలసంధి వెంబడి సముద్రంలో శక్తివంతమైన మైన్స్‌ను ఇరాన్ ఏర్పాటు చేసింది. దురదృష్టం ఏంటంటే వాటిని ఎక్కడ పెట్టామన్నది ఇరాన్ అధికారులు కూడా గుర్తించలేకపోతున్నారు. దీంతో నౌకల ప్రయాణ సమయంలో ఎప్పుడైనా ఇవి పేలే ప్రమాదముంది. ఇవి పేలితే నౌకలు తునాతునకలైపోతాయి. ఈ భయం భారత్‌తో పాటు అన్ని దేశాలకు పట్టుకుంది. ఇతర దేశాలతో పోలిస్తే ఈ సంక్షోభం ప్రభావం భారత్‌పైనే అధికంగా ఉంది.
ప్రత్యామ్నాయ మార్గాలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో తక్కువ ధరకే చమురు, సహజవాయువుల విక్రయాలకు రష్యా ముందుకొచ్చింది. అప్పట్నుంచి భారత్ రష్యాతో చమురు కొనుగోలు ఒప్పందాన్ని కొనసాగిస్తోంది. అంతకుముందు మొత్తం చమురు దిగుమతుల్లో రెండు నుంచి నాలుగు శాతం మాత్రమే రష్యా నుంచి ఉండేది. కాగా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో 14 శాతం వరకు రష్యా దిగుమతులను పెంచారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని 35 శాతానికి భారత్ పెంచుతోంది.
రష్యాలోని వ్లాడివోస్టాక్ నుంచి నేరుగా విశాఖ లేదా ఒడిశాలోని పారాదీప్ రేవుకు చమురు చేరుకుంటుంది. ఈ ప్రయాణంలో ఎక్కడా హార్మూజ్ దాటాల్సిన అవసరం లేదు. అలాగే అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, బ్రెజిల్ దేశాల నుంచి అట్లాంటిక్ సముద్రం మీదుగా కేప్ ఆఫ్ గుడ్ హోప్ రూట్‌లో చమురు దిగుమతులకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ మార్గంలో రవాణాకు సుమారు 15 రోజులు అదనంగా పడుతుంది. దీంతో రవాణా వ్యయం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది.
గుయానా, కెనడాలతో భారత్ కొత్త ఒప్పందాలను చేసుకుంది. త్వరలోనే ఈ దేశాల నుంచి కూడా చమురు దిగుమతులు మొదలవుతాయి. అలాగే దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని భారత్ కొత్త రూట్లను కూడా సిద్ధం చేస్తోంది. రష్యా, ఇరాన్, భారత్‌ల మధ్య ఒక కొత్త సముద్ర మార్గాన్ని సిద్ధం చేస్తోంది. అయితే ఈ మార్గంలో సగ భాగం రైల్లో ప్రయాణం ఉంటుంది. అనంతరం షిప్ ముందుకు సాగుతుంది.
ఈ మార్గంలో చమురుతో పాటు అన్నిరకాల వస్తువుల రవాణా తక్కువ వ్యయంతోనే పూర్తవుతుంది. దీంతో పాటు మధ్యప్రాచ్యం-యూరప్ కారిడార్‌ను అభివృద్ధి చేస్తోంది. యుఎఇ నుంచి సౌదీ, ఇజ్రాయెల్ మీదుగా ఈ మార్గం ఉంటుంది. ఇప్పటికే రష్యా నుంచి కొనుగోళ్లు పెంచిన భారత్ అమెరికా, బ్రెజిల్, కెనడా, పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి కూడా దిగుమతులు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
యుఎఇలోని ఫుజైరా రేవు నుంచి రోజూ 1.80 మిలియన్ బ్యారెళ్లు, ఈజిప్ట్‌లోని ఐన్ సుఖ్నా రేవు నుంచి రోజుకు 2.50 మిలియన్ బ్యారెళ్లు, సౌదీ అరేబియాలోని యాన్బు రేవు నుంచి 5 మిలియన్ బ్యారెళ్లను తెప్పిస్తోంది. కాగా ఇప్పుడు మరిన్ని ప్రత్యామ్నాయ మార్గాలతో చమురు కొరతను నివారించే ప్రయత్నాలు చేపట్టింది. అయితే హార్మూజ్ జలసంధి ద్వారా రవాణాతో పోలిస్తే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రవాణా వ్యయం కాస్త ఎక్కువ. ఈ భారాన్ని వినియోగదార్లు మోయకతప్పదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
