సజావుగా పదో తరగతి పరీక్షలు..

సజావుగా పదో తరగతి పరీక్షలు..
పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమన్వయ శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సోమవారం నగరంలోని బోయపాటి శివరామకృష్ణయ్య మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్, కర్నాటి రాంమోహనరావు మునిసిపల్ హైస్కూల్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. వేసవి నేపథ్యంలో చేసిన తాగునీటి ఏర్పాట్లు, నిరంతర విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, వైద్య శిబిరం వంటి సౌకర్యాలను పరిశీలించారు.
పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులు, సిబ్బందికి స్పష్టం చేశారు. మొత్తం 27,360 మంది విద్యార్థులకు 149 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేసి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూస్తున్నట్లు తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులు సజావుగా పరీక్షలు రాసేందుకు సౌకర్యాలు కల్పించామన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పటిష్ట బందోబస్తును కూడా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్‌టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం పొందేలా చూస్తున్నట్లు తెలిపారు. పదో తరగతి పరీక్షలను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి పరీక్షా కేంద్రంలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని కలెక్టర్ లక్ష్మీశ చెప్పారు.
