రాజధాని పేరిట భారీ అవినీతి..

రాజధాని పేరిట భారీ అవినీతి..

అయినవారికి భూపందారం..
కాంట్రాక్టులు బిల్లుల్లో మాయాజాలం..
కూటమి ప్రభుత్వంపై మల్లాది విష్ణు తీవ్ర ఫైర్

విజయవాడ, ఆంధ్రప్రభ : రాజధాని చట్టబద్ధత పేరిట కూటమి ప్రభుత్వం నాటకాలకు తెరలేపిందని మల్లాది విష్ణు తీవ్రంగా ఆరోపించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పేరుతో భారీ స్థాయిలో అవినీతి జరుగుతోందని, అనుకూల వ్యక్తులకు టెండర్లు కట్టబెడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అమరావతి రాజధాని టెండర్లలో అక్రమాలు జరిగాయని, భూముల కేటాయింపులో పారదర్శకత లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజధాని నిర్ణయం విషయంలో కేవలం శాసనసభ తీర్మానం సరిపోదని, మండలిలో కూడా తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని ప్రశ్నించారు. చట్టబద్ధత పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు.

రాష్ట్ర అభివృద్ధి సమగ్రంగా జరగాలని వైసీపీ మొదటి నుంచే చెప్పుతోందని ఆయన గుర్తుచేశారు. విజయవాడ–గుంటూరు మధ్య రాజధాని ఉండాలని, మచిలీపట్నం పోర్టు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సూచించామని తెలిపారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఒకే ప్రాంతంపై దృష్టి పెట్టి అసమాన అభివృద్ధికి దారితీస్తోందని విమర్శించారు. మూడు రాజధానుల విధానాన్ని విమర్శించే వారు గతంలో జోన్‌లుగా విభజన ఎందుకు ప్రతిపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనలపై స్పష్టత ఇవ్వాలని కోరారు.

అలాగే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు విషయంపై ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. శాసనసభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ, అదే కారణంతో వైసీపీ సభకు హాజరు కావడం లేదని తెలిపారు. సెక్షన్ 5 సబ్ రూల్ 2 ప్రకారం మండలిలో తీర్మానం ఎందుకు చేయడం లేదని నిలదీశారు. ఆలయాల నిర్వహణలో కూడా ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.

ఆలయాల్లో అపచారాలు, దొంగతనాలు పెరిగాయని, హుండీ ఆదాయంలో అవకతవకలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాజధాని ప్రాజెక్టు విఫలమైందని, రైతుల ఆందోళనల నుంచి దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం కొత్త డ్రామాలకు తెరలేపిందని మల్లాది విష్ణు విమర్శించారు.