కిందకు వేలాడిన 11కేవీ తీగ.. 8 గేదెల మృతి…
వినుకొండ, ఆంధ్రప్రభ : వినుకొండ రూరల్ మండలంలోని చీకటీగలపాలెం అడ్డరోడ్డు సమీపంలోని గుండ్లకమ్మ వద్ద కిందకు వేలాడుతున్న 11కేవీ విద్యుత్తు తీగ తగిలి 8 గేదెలు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. బాధితుల వివరాల ప్రకారం, నూజండ్ల మండలం ఐనవోలుకు చెందిన రైతుల గేదెలు మేత కోసం వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతిచెందిన గేదెల విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని రైతులు తెలిపారు. సమాచారం అందుకున్న విద్యుత్తు శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నష్టం వివరాలను ఉన్నతాధికారులకు నివేదించి బాధితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. విద్యుత్తు తీగల నిర్వహణలో నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
