పెద్ద దోబాలో గాలివాన బీభత్సం.. ఎగిరిపోయిన ఇళ్ల రేకులు

పెద్ద దోబాలో గాలివాన బీభత్సం.. ఎగిరిపోయిన ఇళ్ల రేకులు
సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని పంగిడి పంచాయతీ పరిధిలోని పెద్ద దోబా గ్రామంలో గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. గాలి దుమారంతో కొన్ని ఇళ్ల రేకులు ఎగిరిపడి నష్టం వాటిల్లినట్లు పంగిడి సర్పంచ్ ఆత్రం మీరా జాలింషా తెలిపారు. పాకాలపై ఉన్న రేకుల షెడ్లు ఎగిరిపోయి ప్రధాన రహదారి పక్కన పడిపోయాయని చెప్పారు.
ప్రహరీ గోడపై ఏర్పాటు చేసిన తాటి కర్రలు కూడా గాలికి కూలిపోయాయని సర్పంచ్ తెలిపారు. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదని, కానీ ఆస్తి నష్టం ఎక్కువగా జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే పంగిడి సర్పంచ్ ఆత్రం మీరా జాలింషా గ్రామానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. నష్టపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించి, జరిగిన నష్టం వివరాలను సేకరించారు. ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని బాధితులకు హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథ్ రావు సిర్పూర్ (యు) తహసీల్దార్‌కు విషయం తెలియజేసినట్లు తెలిపారు. గాలి దుమారంతో నష్టం జరగడం బాధాకరమని, బాధితులకు ప్రభుత్వపరంగా సాయం అందేలా కృషి చేస్తానని చైర్మన్ విశ్వనాథ్ రావు పేర్కొన్నారు.

