పంట పొలాలను తగలబెడితే కేసులు నమోదు

పంట పొలాలను తగలబెడితే కేసులు నమోదు
- ఎస్సై ఉపేందర్ రావు
ములుగు రూరల్, ఆంధ్రప్రభ: పంట పొలాల్లో వ్యర్థాలను తగలబెడితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ములుగు ఎస్సై యు. ఉపేందర్ రావు హెచ్చరించారు. గురువారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, పంట పొలాల్లో ఉన్న వ్యర్థాలను తొలగించేందుకు రైతులు వాటిని తగలబెట్టడం వల్ల భూమిలోని మేలు చేసే కీటకాలు చనిపోయి, భూమి సారం కోల్పోతుందని తెలిపారు.
పక్కనే కోయని పంట పొలాలు ఉంటే మంటలు వ్యాపించి విలువైన పంట నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. అలాగే బోర్లు, పైపులు, డ్రిప్ పైపులు, ఇతర వ్యవసాయ సామగ్రి దగ్ధమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.రహదారుల పక్కన ఉన్న పంట పొలాలను తగలబెడితే పొగ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎస్సై తెలిపారు. అందువల్ల రైతులు పంట పొలాలను తగలబెట్టరాదని సూచించారు.
పంట పొలాలను తగలబెట్టినట్లు గుర్తిస్తే సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే రెండు కేసులు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేందర్ రావు తెలిపారు.
