సంతాప సభలో కంటతడి పెట్టిన హరీశ్‌రావు..
కేటీఆర్‌తో కలిసి నివాళులు
రామప్ప, పాకాల, ఘనపురం, లక్నవరం, దేవాదుల నీటికి పెద్ది కృషే కారణం
నర్సంపేటకు ప్రభుత్వ వైద్య కళాశాల, 500 పడకల ఆస్పత్రి రావడంలో ఆయన పాత్ర కీలకం: హరీశ్‌రావు
‘నన్ను కాపాడి ఆస్పత్రికి తీసుకెళ్లిన పెద్ది.. అదే ఆస్పత్రిలో కన్నుమూస్తారని కలలోనూ ఊహించలేదు’
నర్సంపేట, ఆంధ్రప్రభ: దివంగత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రజా సేవలను మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు స్మరించుకున్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదిన కర్మ సందర్భంగా నిర్వహించిన సంతాప సభకు హాజరైన వారు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్‌రెడ్డి తన రాజకీయ జీవితంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేశారని గుర్తుచేశారు.
రామప్ప, పాకాల, ఘనపురం, లక్నవరం ప్రాంతాలకు దేవాదుల నీరు వస్తోందంటే అందుకు పెద్ది సుదర్శన్‌రెడ్డి కృషి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారమే కారణమని హరీశ్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ వద్దకు వెళ్లి ఈ ప్రాంతానికి దేవాదుల నీళ్లు కావాలని కోరారని, తనతో పాటు అధికారులకు ఆదేశాలు ఇప్పించి ప్రజలకు సాగునీరు అందేలా కృషి చేశారని తెలిపారు.
నర్సంపేటకు వైద్య కళాశాల కోసం కృషి
తెలంగాణలో జిల్లా కేంద్రం కాని ప్రాంతంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటైన ప్రత్యేకత నర్సంపేటకు దక్కిందని హరీశ్‌రావు అన్నారు. ఇది పెద్ది సుదర్శన్‌రెడ్డి కృషి ఫలితమేనని పేర్కొన్నారు. ఆయనపై ఉన్న అభిమానంతో నర్సంపేట జిల్లా కాకపోయినా 500 పడకల ఆస్పత్రిని కేసీఆర్ మంజూరు చేయించారని తెలిపారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి తన ప్రాంత అభివృద్ధితో పాటు ప్రజల అవసరాల కోసం పట్టుదలతో పనిచేశారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఆయన చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు.
చివరి కార్యక్రమాన్ని గుర్తుచేసుకుని కంటతడి
పెద్ది సుదర్శన్‌రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న హరీశ్‌రావు భావోద్వేగానికి గురయ్యారు. కాకతీయుల కాలం నాటి శివాలయం కూల్చివేత, ఇంటిగ్రేటెడ్ పాఠశాల అంశంపై జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తాను నర్సంపేటకు రావాలని పెద్ది కోరారని చెప్పారు. అదే ఆయనతో కలిసి పాల్గొన్న చివరి కార్యక్రమం అవుతుందని తాను కలలో కూడా ఊహించలేదని కంటతడి పెట్టారు.
‘నన్ను కాపాడింది పెద్ది సుదర్శన్‌రెడ్డే’
పెద్ది సుదర్శన్‌రెడ్డి అనారోగ్యానికి గురైన సమయంలో తాను, కేటీఆర్ హుటాహుటిన ఆస్పత్రికి వచ్చామని హరీశ్‌రావు తెలిపారు. ఆ సమయంలో ఆస్పత్రిని చూసినప్పుడు తనకు పాత జ్ఞాపకం గుర్తుకొచ్చిందన్నారు.
ఒక ఉద్యమకారుడు ఆత్మహత్య చేసుకున్న సమయంలో అంతిమయాత్ర కోసం డీసీఎం వాహనంపై మృతదేహాన్ని తీసుకెళ్లామని హరీశ్‌రావు గుర్తుచేశారు. వరంగల్‌లోని అమరవీరుల స్థూపం వద్ద పోలీసులతో ఘర్షణ జరిగిన సమయంలో తాను డీసీఎం పైనుంచి కిందపడిపోయానని చెప్పారు. ఆ సమయంలో తాను నేరుగా కిందపడకుండా పట్టుకుని కాపాడింది పెద్ది సుదర్శన్రెడ్డేనని, అనంతరం తనను ఆస్పత్రికి తీసుకెళ్లారని గుర్తుచేసుకున్నారు.
‘ఆ రోజు నన్ను పెద్ది సుదర్శన్‌రెడ్డి ఏ ఆస్పత్రికి తీసుకెళ్లారో.. అదే ఆస్పత్రిలో ఆయన ప్రాణాలు కోల్పోతారని కలలో కూడా అనుకోలేదు’ అంటూ హరీశ్‌రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణం నర్సంపేట ప్రజలకు, బీఆర్ఎస్ శ్రేణులకు తీరని లోటని కేటీఆర్, హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల కోసం పనిచేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.
