Prescription | దాని అర్థం తెలియక మందులు వాడితే ప్రమాదమే!

Prescription | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తలనొప్పి, జ్వరం, జలుబు, ఒంటినొప్పులు.. ఇలా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు చాలామంది ముందుగా ట్యాబ్లెట్‌లనే ఆశ్రయిస్తుంటారు. కొందరు వైద్యుల సూచనతో మందులు వాడితే, మరికొందరు నేరుగా మెడికల్ షాపుకు వెళ్లి కొనుగోలు చేసి వేసుకుంటుంటారు. ఒక‌సారి మెడిక‌ల్ షాప్ నుంచి తీసుకున్న ట్యాబ్లెట్ల‌ను ఒక‌టి లేదా రెండు వాడిన త‌ర్వాత మిగ‌తా వాటిని అలాగే దాసి ఉంచి మ‌రో సారి అనారోగ్యం వ‌చ్చిన‌ప్పుడు కూడా వాడుతుంటారు. అయితే ట్యాబ్లెట్ ప్యాకెట్‌పై ఉండే రెడ్ లైన్, మాత్రపై కనిపించే గీతలు (లైన్స్) ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా గమనించారా? వాటి వెనుక ఉన్న అసలు ఉద్దేశం తెలుసుకోవడం చాలా ముఖ్యం.

సాధారణంగా వైద్యుల సలహా లేకుండా మందులు వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తుంటారు. అయినప్పటికీ చిన్న చిన్న సమస్యల కోసం చాలామంది స్వయంగా మందులు కొనుగోలు చేసి వాడుతున్నారు. ఎందుకంటే మ‌ధ్య‌త‌ర‌గ‌తి కంటుంబాల‌కు చెందిన వారు ఆ స‌మ‌యంలో డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళ్లే స్థోమ‌త లేక‌, డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళ్లితే రూ.500 నుంచి 15 వంద‌ల వ‌ర‌కు డాక్ట‌ర్ ఫీజుకే చెల్లించాల్సి వ‌స్తుంద‌నీ, నేరుగా మెడిక‌ల్ షాప్‌కు వెళ్లి మాత్ర‌లు కొనుగోలు చేస్తే వాటికి అయ్యే ఖ‌ర్చు రూ.100 నుంచి రూ.200 ల వ‌ర‌కే అవుతుంది.

ఇలాంటి సందర్భాల్లో మందుల ప్యాకెట్‌పై ఉన్న హెచ్చరికలను అర్థం చేసుకోవడం అవసరం. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో మందుల ప్యాకెట్‌పై ఉండే రెడ్ లైన్ గురించి అవగాహన కల్పించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ట్యాబ్లెట్ స్ట్రిప్‌పై ఉండే రెడ్ లైన్ ఆ మందును వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదనే హెచ్చరిక. కొన్ని మందులపై రెడ్ బాక్స్ కూడా ఉంటుంది. అది కూడా అదే అర్థాన్ని సూచిస్తుంది. అంటే, అలాంటి మందులను డాక్టర్ సూచించిన విధంగానే, సూచించిన మోతాదులోనే వాడాలి.

ఇక ట్యాబ్లెట్‌పై కనిపించే గీత (Score Line) కూడా ఒక ప్రత్యేక ఉద్దేశంతోనే ఉంటుంది. అవసరమైతే వైద్యుల సూచన మేరకు మాత్రను సమాన భాగాలుగా విభజించేందుకు ఆ గీతను ఇస్తారు. అయితే ప్రతి గీత ఉన్న మాత్రను విరిచి వాడడం సరైంది కాదు. కొన్ని మాత్రలు పూర్తిగా మింగాల్సి ఉంటుంది. అందువల్ల వాటిని విరిచే ముందు వైద్యుడు లేదా ఫార్మసిస్ట్ సలహా తీసుకోవడం మంచిది.

మందులను నిర్లక్ష్యంగా లేదా స్వయంగా నిర్ణయించి వాడడం వల్ల దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ట్యాబ్లెట్ ప్యాకెట్‌పై ఉండే రెడ్ లైన్, రెడ్ బాక్స్ వంటి హెచ్చరికలను గమనించి, వైద్యుల సూచనల మేరకే మందులు ఉపయోగించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.