హైదరాబాద్, ఆంధ్రప్రభ : ధాన్యం కొనుగోలు విషయంలో కలెక్టర్లు ఎస్‌ఓపి (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్) ఖచ్చితంగా అనుసరించాలని, అనూహ్య వర్షాల వల్ల ధాన్యానికి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
రాష్ట్రంలో సరిపడిన పరిమాణంలో డిఏపీ, కాంప్లెక్సులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. నకిలీ పత్తి విత్తనాల ముప్పును అరికట్టేందుకు జిల్లా స్థాయి, మండల స్థాయి, టాస్క్‌ఫోర్స్ సమావేశాలు వెంటనే నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. నకిలీ విత్తనాల విక్రయం, సరఫరాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులతో కలసి ప్రెస్‌మీట్ నిర్వహించి భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన ముందు జాగ్రత్త చర్యల వివరాలను ప్రజలకు తెలియచేయాలని కలెక్టర్లకు సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో తెరచి ఉన్న నాలాలు, మాన్‌హోల్స్ మూసి ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
వర్షాల కారణంగా నగరంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు గురువారం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షపాతం కారణంగా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ప్రీమాన్సూన్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ధాన్యం, పత్తి కొనుగోలు, పంట నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఇతర వ్యవసాయ కార్యకలాపాలపై సమీక్షించారు. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో అల్పపీడనం కారాణంగా రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ కలెక్టర్లకు వివరించారు.
రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. తదుపరి పదిహేను రోజులు జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. డీజీ ఫైర్ సర్వీసెస్ నాగిరెడ్డి మాట్లాడుతూ వర్షాల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా నివారించేందుకు ఫైర్ ఆఫీసర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతోందని తెలిపారు.
కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాలలో వరద ముంపు ఏర్పాడితే కాపాడేందుకు ప్రత్యేక బృందాలను మోహరించామని తెలిపారు. సివిల్ స్లపస్ ముఖ్య కార్యదర్శి డిఎస్ చౌహాన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపీ, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఇతర అధికారులు టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.