కేంద్రీయ విద్యాలయ విద్యార్థులకు అవస్థలు..

  • మరో బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్

మంచిర్యాల, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలోని కేంద్రీయ విద్యాలయానికి వెళ్లే విద్యార్థులు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రవాణా సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా సమీపంలో పాఠశాల నిర్వహణలో ఉండగా తల్లిదండ్రులు తమ పిల్లలను సొంత వాహనాల్లో పాఠశాలకు తీసుకెళ్లేవారు. అనంతరం గుడిపేటలో శాశ్వత భవనం నిర్మాణం పూర్తికావడంతో పాఠశాలను అక్కడికి మార్చారు.

ప్రస్తుతం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్, నస్పూర్, ఏసీసీ, హమాలీవాడ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు ఈ పాఠశాలకు వస్తున్నారు. వారి రాకపోకల కోసం టీజీఎస్‌ఆర్టీసీ ఒక బస్సును మాత్రమే ఏర్పాటు చేసింది. అయితే పాఠశాలలో చదివే దాదాపు 90 శాతం మంది విద్యార్థులు ఈ ప్రాంతాల నుంచే రావడంతో ఒక్క బస్సు సరిపోవడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.

ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు విద్యార్థులంతా ఒకే బస్సుపై ఆధారపడాల్సి వస్తోందని, దీంతో రద్దీ కారణంగా ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు పేర్కొన్నారు.

విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని కేంద్రీయ విద్యాలయానికి అదనంగా మరో టీజీఎస్‌ఆర్టీసీ బస్సును మంజూరు చేయాలని జిల్లా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.