ఎస్ఐఆర్–2026 అమలుకు సమన్వయం..
బీఎల్ఓలు, బీఎల్ఏలకు కీలక సూచనలు
ఓటరు జాబితా పరిశీలన, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీపై శిక్షణ..
బూత్‌ల వారీగా సంయుక్త పర్యటన
కరీమాబాద్, ఆంధ్రప్రభ: వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని వెంకటేశ్వర హైస్కూల్ ప్రాంగణంలో శుక్రవారం ఎస్ఐఆర్–2026 కార్యక్రమం అమలుపై బీఎల్ఓలు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బీఎల్ఏలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పోలింగ్ స్టేషన్లు 176, 177, 178, 179లకు చెందిన బీఎల్ఓలు పిన్నా నిహారిక, దమయంతి, సుధారాణి, పద్మ పాల్గొన్నారు. రాజకీయ పార్టీల తరఫున పాల కుమారస్వామి, చీర మోహన్, వీ. నికిత, ఆకుతోట రాజు, మాచర్ల చెన్నారావు, సందీప్ తదితర బీఎల్ఏలు, సపోర్టింగ్ స్టాఫ్ హాజరయ్యారు.
జూన్ 25 నుంచి ప్రారంభమైన ఎస్ఐఆర్–2026 కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలను ఇంటింటికీ ఒకే విధానంలో పంపిణీ చేసే రూట్ మ్యాప్‌పై సమావేశంలో చర్చించారు. ఫారాలను సక్రమంగా పూరించే విధానం, ఓటర్లకు అవగాహన కల్పించడం, అవసరమైన పత్రాలపై వివరాలు అందించారు.
బూత్ స్థాయిలో మరణించిన ఓటర్లు, డబుల్ ఓటర్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి వివరాలను గుర్తించి నమోదు చేసే విధానంపై బీఎల్ఓలకు సూచనలు ఇచ్చారు. తాత్కాలికంగా వలస వెళ్లిన ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందించే విధానాన్ని కూడా వివరించారు.
అలాగే 2002 ఓటరు జాబితాలో పేర్లను గుర్తించే విధానంపై బీఎల్ఏలకు శిక్షణ ఇచ్చారు. బీఎల్ఏల బాధ్యతలు, క్షేత్రస్థాయిలో సమన్వయం, ఓటర్లకు అవగాహన కల్పించే అంశాలపై చర్చించారు.
సమావేశం అనంతరం బీఎల్ఓలు, బీఎల్ఏలు బూత్‌ల వారీగా ఓటరు జాబితాను క్రమ సంఖ్య 1 నుంచి చివరి వరకు సంయుక్తంగా పరిశీలిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటించారు.
