తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్

  • కాంగ్రెస్, బిఆర్ఎస్ లు ఒక్కటే
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో జాప్యం ఎందుకు
  • పార్లమెంట్ అభివృద్ధికి 22 వేల కోట్లు తీసుకొచ్చా
  • కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్, ఆంధ్రప్రభ : తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలియజేశారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ మరో వారం రోజుల్లో రూ.50 కోట్ల యూడీఎఫ్ నిధులతో కరీంనగర్ లో రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించబోతున్నామన్నారు.

మరో 3 నెలల్లో అర్బన్ ఛాలెంజ్ స్కీం కింద కేంద్రం ఇచ్చిన రూ.840 కోట్ల నిధులతో కరీంనగర్ ను సుందరంగా తీర్చిదిద్దే పనులను ప్రారంభించబోతున్నామన్నారు. కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అందించిన 100 రోజుల్లోనే యూడీఎఫ్ నిధులను తీసుకొచ్చామన్నారు. కరీంనగర్ లో పార్కింగ్ సమస్య లేకుండా రూ.25 కోట్లతో శాశ్వత పరిష్కార పనులకు శ్రీకారం చుట్టామన్నారు.

పార్లమెంట్ అభివృద్ధికి 22వేల కోట్లు..

ఎంపీగా ఎన్నికైనప్పటి నుండి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ది కోసం రూ.22 వేల కోట్లు తీసుకొచ్చిన. రోడ్ల నిర్మాణం కోసమే రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నం. దసరా నాటికి కరీంనగర్ వరంగల్ హైవే రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. అతి త్వరలో కరీంనగర్ జగిత్యాల హైవే పనులను ప్రారంభిస్తాం.గన్నేరువరం బ్రిడ్జి నిర్మాణ పనులకు సైతం అతి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నాం. రాబోయే రోజుల్లో కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తా.

కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు బిగ్ బాస్ షోను తలపిస్తోంది

కాంగ్రెస్ భారత రాష్ట్రపతి నాయకుల డ్రామాలు బిగ్ బాస్ షోను తలదనన్నేలా ఉన్నాయి. వాళ్ల నాటకాలను చూసి జనం నవ్వుకుంటున్నారు.
మీడియా కవరేజీ కోసం రెండు పార్టీలు పడుతున్న తంటాలను చూసి జనం నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలే ఆ రెండు పార్టీలను తెలంగాణ ప్రజలు ఎలిమినేషన్ చేయబోతున్నారు.

తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్

తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో అది సాధ్యమవుతుంది. కేంద్రంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తుంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో జాప్యం ఎందుకు

ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టారు. అయినా ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదు.గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ప్రత్యర్ధులను వేధించడానికి వాళ్ల ఫోన్ నెంబర్లను కూడా ట్యాపింగ్ చేయించారు. ఈ కేసు విచారణను ఎప్పుడు పూర్తి చేస్తారు.బాద్యులను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు.ఫోన్ ట్యాపింగ్ కేసు జాప్యం వెనుక కారణాలేమిటి.

ఉపాధి హామీ కోసం దేశవ్యాప్తంగా రూ.8 లక్షల కోట్లు ఖర్చు చేశాం

ఉపాధి హామీ కోసం ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశాము. తెలంగాణలోనూ రూ.39 వేల కోట్లు ఖర్చు చేశాం. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం ద్వారా ఆస్తుల స్రుష్టి సరిగా జరగడం లేదు.
వీబీజీ రామ్ జీ స్కీం ద్వారా ఆస్తులను స్రుష్టించబోతున్నాం. కూలీలకు కచ్చితంగా 125 రోజులు పని కల్పించబోతున్నాం. ఒకవేళ పని కల్పించకపోతే 15 రోజుల్లోనే వేతనం అందించాలని రూల్స్ లో చేర్చాం.ఇంత మంచి స్కీంను విమర్శించడం బాధాకరం. ఈ స్కీంతో రాష్ట్రంపై భారం పడుతుందని భావిస్తే ప్రధానిని కలిసి మాట్లాడాలి.

సింగరేణిలో బొగ్గు మాయంపై తక్షణమే విచారణ

సింగరేణిలో బొగ్గు మాయంపై తక్షణ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రానికి చేతగాకపోతే కేంద్రాన్ని కోరితే విచారణ జరిపి దోషుల సంగతి చూసేందుకు మేం సిద్ధం.