నందికొట్కూరులో ట్రాఫిక్ కష్టాలకు చెక్

నందికొట్కూరులో ట్రాఫిక్ కష్టాలకు చెక్
నందికొట్కూరు, ఆంధ్రప్రభ: నందికొట్కూరు పట్టణంలో ఏళ్లుగా కొనసాగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపే దిశగా రూ.3 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పట్టణంలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్ నుంచి శ్లోకాస్ స్కూల్ వరకు చేపట్టనున్న సెంట్రల్ డివైడర్, లైటింగ్ పనులకు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, టీడీపీ సీనియర్ నాయకుడు మాండ్ర శివానందరెడ్డి శుక్రవారం భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నందికొట్కూరు అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ప్రజలు రోడ్లపై ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నా, గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. రాత్రివేళ సరైన లైటింగ్ లేక ప్రమాదాలు జరిగినా చర్యలు తీసుకోలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం నందికొట్కూరు అభివృద్ధికి చర్యలు చేపట్టిందని తెలిపారు.
నందికొట్కూరు అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే గిత్త జయసూర్య పేర్కొన్నారు. డివైడర్, లైటింగ్ పనులను అవినీతి, అక్రమాలకు తావు లేకుండా నాణ్యతతో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ పనుల పూర్తి కోసం ప్రజల సహకారం అవసరమని అన్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ, వైసీపీ పాలనలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని విమర్శించారు. ఐదేళ్లపాటు నిధులు దారి మళ్లించి అభివృద్ధిని అటకెక్కించారని ఆరోపించారు.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి, బీజేపీ సహకారంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని అన్నారు. వైసీపీ పాలనలో జరిగిన నష్టాలను ఒక్కొక్కటిగా సరిదిద్దుతామని స్పష్టం చేశారు. గతంలో శంకుస్థాపనలకే పరిమితమైన పనులు, కూటమి ప్రభుత్వంలో ప్రారంభోత్సవాలకు చేరుతున్నాయని ఆయన అన్నారు. నందికొట్కూరు రూపురేఖలు మార్చే బాధ్యత తమదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పట్టణ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
