సమస్యలు పరిష్కరించాలని నిరసన..
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం పెద్దపల్లి బస్టాండ్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద గ్రామ పంచాయతీ కార్మికులు నిరసన తెలిపారు. సీఐటీయూ నాయకుడు ముత్యం రావు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామంలో విధులు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల డివిజన్ స్థాయి అధికారి ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేశారని కార్మికులు ఆరోపించారు. దీనికి నిరసనగా వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆందోళనకు పిలుపునిచ్చినట్లు తెలిపారు.
ఆందోళనలో పాల్గొనేందుకు పెద్దపల్లి మండలానికి చెందిన కార్మికులు సిద్ధమైనప్పటికీ, కొందరు అధికారుల ఒత్తిడి కారణంగా వాట్సాప్లో పిలుపునిచ్చిన కార్మికులు హాజరు కాలేదని పేర్కొన్నారు. దీంతో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి తమ ఆందోళనను వ్యక్తం చేశారు.
గ్రామాల్లో మల్టీపర్పస్ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికుల పట్ల అధికారులు సహృదయంతో వ్యవహరించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులపై చర్యలు తీసుకోవడం కంటే విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని వివిధ సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు.
